డబ్బులు ఆశచూపి.. ముగ్గురు బాలికలపై వృద్ధుడి అత్యాచారం..

By SumaBala Bukka  |  First Published Oct 13, 2023, 6:44 AM IST

చిన్నారులకు డబ్బులిస్తానని ఆశచూపి ఓ వృద్ధుడు దారుణానికి తెగించాడు. 8,11,13యేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.


జగిత్యాల : తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధుడు గ్రామంలోని ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారంనాడు ఎస్సై నరేష్ కుమార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా చెప్పుకొచ్చారు. నిందితుడు గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ముత్తయ్య (65). 

నిరుడు ఎండాకాలంలో తమ ఇంటి దగ్గర్లో ఉండే 13 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత, అక్కడితో ఆగలేదు.. 8, 11 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు చిన్నారులపై కూడా కన్నేశాడు. వారిద్దరికీ డబ్బులు ఇస్తానని ఆశ చూపించి తన వెంట వచ్చేలా చేసాడు. అలా చిన్నారులను తన ఇంటికి తీసుకువెళ్లి వారి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా 13 ఏళ్ల బాలిక ఇటీవల అనారోగ్యానికి  గురైంది.  

Latest Videos

స్నేహితుడితో ఓయో గదికి వచ్చి, మద్యం తాగి.. ఉదయానికి అనుమానాస్పదస్థితిలో యువతి మృతి..

కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లి  విషయం ఏంటని కనుక్కుంది. దీంతో లైంగిక దాడి విషయం బయటపడింది. అది విని షాక్ అయిన కుటుంబసభ్యులు.. వెంటనే పోలీసులను  ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన ముత్తయ్య మీద పొక్సో కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న చెరుకుతోటలో 13 ఏళ్ల బాలిక చిధ్రమైన మృతదేహం లభ్యమైంది. ఆ బాలికను  చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా కనిపిస్తుంది. ఆ బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లి, తిరిగా రాలేదు. దీంతో రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు, అన్ని చోట్లా వెతికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిమీద ఫిర్యాదు నమోదు చేయలేదు.

మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక కళ్లను బయటకు పీకారని, చిత్రహింసలకు గురిచేసినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించి ఫిర్యాదు నమోదు చేశారు.

లఖింపూర్ ఖేరీ పోలీసు సూపరింటెండెంట్ (SP) గణేష్ ప్రసాద్ సాహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశోధించి, మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును సకాలంలో నమోదు చేసి ఉంటే, రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలికను రక్షించగలిగేవారని ఆమె అన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ, “ప్రాథమికంగా, చాలా గాయాల గుర్తులు కనిపిస్తున్నందున, బాలికను కొట్టి చంపినట్లు కనిపిస్తోంది, అయితే పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత వాస్తవాలు తెలుస్తాయన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌ల నుండి కూడా నిఘా బృందాలను ఈ కేసును చేధించడానికి నియమించాం. నిజంగా జరిగిందేమిటో కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నాం. కుటుంబ సభ్యులతో మాట్లాడాం. వారు ప్రస్తుతం ఎవరి మీదా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు”అన్నారాయన.

click me!