numaish 2023 నుమాయిష్‌కు సర్వం సిద్ధం .. ఈసారి మరింత కొత్తగా, ఎన్ని స్టాళ్లో తెలుసా..?

By Siva Kodati  |  First Published Dec 23, 2023, 3:35 PM IST

హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నుమాయిష్‌కు రంగం సిద్ధమైంది. ప్రతి యేటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇది జరగనుంది.  ఈసారి 2,400 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం కేటాయింపు పూర్తవ్వగా.. మరికొన్నింటికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 


హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నుమాయిష్‌కు రంగం సిద్ధమైంది. ప్రతి యేటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇది జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 2,400 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం కేటాయింపు పూర్తవ్వగా.. మరికొన్నింటికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా స్టాళ్ల ఏర్పాటుకు మైదానంలో లే ఔట్‌ పనుల్ని తీర్చిదిద్దుతున్నారు. 

మరోవైపు నుమాయిష్ ప్రవేశ ద్వారా వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు రూ.40గా నిర్ణయించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. విగలాంగులు, వృద్ధుల కోసం ఎగ్జిబిషన్ లోపల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే సందర్శకుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పలు డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. నాంపల్లి, గాంధీ భవన్‌ మెట్రో స్టేషన్‌ల నుంచి మెట్రోలు కూడా అదనంగా నడిపే అవకాశం వుంది. గతేడాది నుమాయిష్‌ను దృష్టిలో వుంచుకుని అర్ధరాత్రి 12 గంటల వరకు రైళ్లను నడిపారు. 

Latest Videos

ఈ సారి 25 లక్షలకు పైగా సందర్శకులు నుమాయిష్‌కు వచ్చే అవకాశం వుంది. అలాగే నుమాయిష్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో నుమాయిష్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో వుంచారు. మరోవైపు.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎంపికయ్యారు. 

ఇకపోతే.. నుమాయిష్‌ను 1938లో అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ అనంతరకాలంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఈ ఎగ్జిబిషన్ ఓ ఫ్లాట్‌ఫాంగా ఉపయోగపడుతూ వస్తోంది. 2021లో దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నుమాయిష్ రద్దయ్యింది. 
 

click me!