NTR Jayanti: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి.. పురందేశ్వరి భావోద్వేగం

By Sumanth KanukulaFirst Published May 28, 2022, 9:26 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తరలివస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తరలివస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‎లు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. 

ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరకుని నివాళులర్పించారు. నందమూరి రామకృష్ణ,  దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు. నేటి నుంచి వచ్చే ఏడాది 28 వరకు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదిపాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, పరుచూరి వంటి ప్రముఖులు ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రణ గురించి తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నామని చెప్పారు. అన్ని రంగాలలో నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కారం చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భిక్ష వల్లే ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నానని తెలిపారు. సమాజమే దేవాలయంగా భావించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మనపై ఉంటాయని చెప్పారు. 

click me!