
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అవమానకరంగా వ్యవహరించారంటూ అరెస్ట్ అయిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గాడిదకు కేసీఆర్ చిత్ర పటం పెట్టడంతో పాటు గాడిద దొంగతనం, ఇతర సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు జమ్మికుంట పోలీసులు. అనంతరం వెంకట్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున (kcr birthday) నిరసనలకు సిద్దమైన కాంగ్రెస్ (telangana congress) నాయకుల అరెస్టులు నిన్న(గురువారం) ఉదయం ప్రారంభమై అర్దరాత్రి వరకు కొనసాగాయి. నిన్న ఉదయమే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సహా పలువురు కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు.
అయితే పోలీస్ నిర్బందాన్ని దాటుకుని ఎన్ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (balmoori venkat) ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి కరీంనగర్ లో వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ గాడిదకు కేసీఆర్ చిత్రపటం పెట్టి పుట్టినరోజు వేడుక జరిపారు. దీంతో టీఆర్ఎస్(trs) నాయకులు వెంకట్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. ఇలా రెండు పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు అందడంతో రెండు చోట్లా వెంకట్ పై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే గురువారం అర్దరాత్రి హుజురాబాద్ లోని తన నివాసానికి వెళుతుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. పోలీస్ వాహనంలో అతన్ని జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, వెంకట్ కు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేయడం సరికాదని వెంకట్ అన్నారు.
తాము పిర్యాదులు చేస్తే పట్టించుకోని పోలీసులు టీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేస్తే మాత్రం వెంటనే కేసులు నమోదు చేసి ఇలా అర్ధరాత్రులు అరెస్ట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసినట్లే తమ నాయకుడు రాహుల్ గాంధీ గురించి అనుచితంగా మాట్లాడిన అసోం సీఎం హేమంత బిస్వ శర్మను అరెస్ట్ చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేసారు.