శేషన్నకు షెల్టర్ ఇవ్వలేదు: మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published May 21, 2019, 11:31 AM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు శేషన్నకు తాను షెల్టర్ ఇవ్వలేదని మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

నెల్లూరు: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు శేషన్నకు తాను షెల్టర్ ఇవ్వలేదని మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తనను  అంతమొందించేందుకు టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే తనకు శేషన్నతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. నయీం ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత శేషన్న తనను కలిసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.  తన హోటల్‌లో శేషన్న భోజనం చేసి వెళ్లాడని ఆయన చెప్పారు.

 శేషన్న తమ గ్రామానికి చెందినవాడేనని ఆయన  చెప్పారు. కర్నూల్ జిల్లా బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో శేషన్నకు  ఆశ్రయం కల్పించినట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. శేషన్న లాంటి వాళ్లు ఆ గ్రామానికి వస్తే చెప్పుతో కొడతారని.... ఆయన చెప్పారు.

బొల్లవరం గ్రామానికి తాను 20 ఏళ్లుగా వెళ్లలేదని వెంకట్ రెడ్డి చెప్పారు.ఈ గ్రామానికి చెందిన తన సహచరుడు రాంబాబు మృతి చెందిన తర్వాత  తాను  ఆ గ్రామానికి వెళ్లలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.

కర్నూల్ జిల్లాలో తాను వైసీపీకి అనుకూలంగా పనిచేసినందున.. టీడీపీ నేతలు తనకు వ్యతిరేకంగా  కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తాను పోలీసులను తప్పించుకు తిరగడం లేదన్నారు. తాను ఎస్పీని కలిసి తన వాదనను విన్పిస్తానని ఆయన వివరించారు.

నయీం గ్యాంగ్‌తో తాను ఏనాడూ కలిసి పనిచేయలేదన్నారు. ఒకవేళ తాను ఆ గ్యాంగ్‌తో కలిసి పనిచేసినట్టుగా నిరూపిస్తే  ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.తాను ప్రజాస్వామిక వాదినని ఆయన చెప్పారు. 

తనపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం విషయమై ఎస్పీని కలిసి వివరణ ఇవ్వనున్నట్టు చెప్పారు.తమ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను పోలీసులను కూడ తప్పించుకొని తిరగడం లేదన్నారు.

 

సంబంధిత వార్తలు

బొల్లవరంలో నయీం అనుచరుడు శేషన్న షెల్టర్

 

 

click me!