ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 19, 2022, 3:47 PM IST
Highlights

తనను ఏ కేసులో  విచారణకు  పిలిచారో  తెలియదని  తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు.  అయ్యప్పదీక్షలో ఉన్నందున తనకు  సమయం ఇవ్వాలని కోరినా కూడా  ఈడీ నిరాకరించిందని  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ఏ కేసులో తనను  విచారణకు రావాలని  పిలిచారో తెలియదని  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు.సోమవారం నాడు మధ్యాహ్నం  ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి హాజరయ్యారు.ఈడీ కార్యాలయం వద్ద  ఆయన  మీడియాతో మాట్లాడారు.ఈడీ నోటీసులపై  తాను సమయం కోరినట్టుగా  చెప్పారు.ఈ మేరకు తన  పీఏ ద్వారా లేఖను పంపానన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున   ఈ నెల  31వ తేదీ వరకు  సమయం ఈడీని అడిగినట్టుగా  చెప్పారు. కానీ  తనకు సమయం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించినట్టుగా  రోహిత్ రెడ్డి తెలిపారు.  చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా  ఈడీ విచారణకు హాజరైనట్టుగా  రోహిత్ రెడ్డి  తెలిపారు.  ఏ కేసు అనే విషయం  తనకు పంపిన నోటీసులో పేర్కొనలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరించారు. విచారణకు సహకరించేందుకు  తాను  ఇక్కడికి వచ్చినట్టుగా  పైలెట్ రోహిత్ రెడ్డి  తెలిపారు.ఈ నెల  16వ తేదీన పైలెట్ రోహిత్ రెడ్డికి  ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.  ఇవాళ  విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈడీ అధికారులు పంపిన నోటీసుల ఆధారంగా  పైలెట్ రోహిత్ రెడ్డి  ఇవాళ విచారణకు హాజరయ్యారు.

also read:ఈడీ విచారణకు హాజరైన తాండూరు ఎమ్మెల్యే: బ్యాంకు స్టేట్‌మెంట్‌తో ఈడీ కార్యాలయానికి పైలెట్ రోహిత్ రెడ్డి

ఈ ఏడాది అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ  ముగ్గురు పోలీసులకు చిక్కారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు.ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడిన ఆడియో , వీడియో సంభాషణలను కూడా మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురి చేసిన నిందితులను అరెస్ట్  చేయించడంలో  పైలెట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించినందునే  అతడిని బీజేపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని  బీఆర్ఎస్  నేతలు విమర్శిస్తున్నారు.

ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసులో ఉన్న ముగ్గురితో తమ పార్టీకి సంబంధం లేదని  బీజేపీ నేతలు ప్రకటించారు. తమ పార్టీలో  ఎవరినైనా చేర్చుకొంటే  వారితో  తామే నేరుగా చర్చలు జరుపుతామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.  కానీ  బీజేపీ నేతల వాదలను బీఆర్ఎస్  నేతలు తోసిపుచ్చుతున్నారు.

click me!