బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేవని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ తో భవిష్యత్తులో పొత్తు ఉండదని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి గురువారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పగలవా అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా..? అని ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా. అని అడిగారు. తాను పార్టీ ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతుందన్నారు. తెలంగాణ లో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఅర్ కు మద్దతుగానే ఉన్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఅర్ కి సప్లయ్ కంపెనీగా మారిందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఅర్ అరాచకాలను తాను ప్రశ్నించినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్ ను నిలదీసినట్టుగా షర్మిల ప్రస్తావించారు.
పొత్తులకో, విలీనం చేయడం కోసం తాను వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేయలేదని షర్మిల తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం 3850 కి.మీ. పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇంత కష్ట పడింది పార్టీని విలీనం చేయడానికి కాదన్నారు. తాను ఏదైనా పార్టీలో చేరుతాను అంటే వద్దనే వాళ్ళు ఎవరున్నారు. తాను కేసీఅర్ దగ్గర చెరుతాను అంటే కూడా వ్యతిరేకిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్‌టీపీని జాతీయ పార్టీలో విలీనం చేస్తారని అవమానపరుస్తున్నారన్నారు. పార్టీని విలీనం చేస్తానని ప్రచారం చేసి తాను నేను పడిన కష్టాన్ని తక్కువ చేయవద్దని షర్మిల కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్‌టీపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్ధులను తయారు చేసుకుంటున్నామన్నారు.
పొత్తులు అనేది రేపటి అంశంగా షర్మిల పేర్కొన్నారు. 2018 లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుస్తే 14 మందిని కేసీఅర్ కొనుగోలు చేశారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఅర్ కి ఓటు వేసినట్లేనని ఆమె అబిప్రాయపడ్డారు. కేసీఆర్ కు అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ కు ఓటేస్తే మీ లీడర్లు బయటకు పోకుండా కట్టిపెట్టే న్యాయకత్వం ఉందా అని కాంగ్రెస్ కు షర్మిల ప్రశ్నించారు.
ఎన్నికల తర్వాత కేసీఅర్ కి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా లేదా..? స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ దఫా కేసీఆర్ కి 30 కంటే తక్కువ సీట్లు వస్తాయని ఆమె జోస్యం చెప్పారు. అన్ని పార్టీలు కేసీఅర్ కి వ్యతిరేకం అని క్లారిటీ ఇవ్వాలన్నారు. అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తామని షర్మిల తేల్చి చెప్పారు.