కస్టడీలోని నగదు, బంగారం మాయం: ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీ వేణుగోపాల్ సస్పెన్షన్

By narsimha lodeFirst Published Sep 5, 2021, 2:59 PM IST
Highlights

కస్టడీలో ఉన్న నగదు, బంగారం మాయం కావడంపై నిజామాబాద్ డీఎస్పీ  వేణుగోపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. వేణుగోపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ నగదు, బంగారం మాయమైందని ఏసీబీ ఉన్నతాధికారులు భావించారు. రాష్ట్రంలోని  కస్టడీలో ఉన్న నగదు, బంగారంపై కూడ ఆడిటింగ్ చేపట్టింది  ఏసీబీ.

నిజామాబాద్: ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీ వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.  ఏసీబీ కస్టడీలో ఉన్న నగదు, నగలు మాయం కావడంపై ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.కరీంనగర్ లో  వేణుగోపాల్ ఏసీబీ డీఎస్పీగా పనిచేసే సమయంలో  ఓ కేసులో  రూ. 2 లక్షల నగదు. 10 తులాల బంగారాన్ని ఏసీబీ సీజ్ చేసింది.  2009లో ఈ కేసు నమోదైంది.ఈ నగదు ఎక్కడుందనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు బంగారు ఆభరణాల స్థానంలో రోల్‌గోల్డ్ నగలు ప్రత్యక్షం కావడంపై అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో నగదు, బంగారం మాయం కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. 

ఈ డబ్బు, బంగారాన్ని కస్టడీలో ఉంచాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే ఈ బంగారం, నగదు  మాయమైంది. ఈ విషయంలో ఏసీబీ డీఎస్పీ వేణుగోపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమనే ఆరోపణలతో ఆయనపై సస్పెండ్ వేటు పడింది.ఈ విషయం వెలుగు చూడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కస్టడీలో ఉన్న సొమ్మును ఆడిట్ చేయాలని ఏసీబీ నిర్ణయం తీసుకొంది.రాష్ట్ర వ్యాప్తంగా  కస్టడీలో నగదు, బంగారం విషయంలో  ఆడిటింగ్  విషయంలో  ఏం తేలుతుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

click me!