పోలీసుల తీరుపై ఆగ్ర‌హం.. న‌డి రోడ్డు మీద బైఠాయించిన ఎంపీ అర్వింద్

By Rajesh KFirst Published Jan 25, 2022, 2:26 PM IST
Highlights

Mp Arvind Protest: నిజామాబాద్ జిల్లా పోలీసులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పించారు. 
 

Mp Arvind Protest: నిజామాబాద్ జిల్లా పోలీసులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే  నందిపేటకు వెళ్తున్న ఎంపీ అర్వింద్ ను, బీజేపీ కార్యకర్తలను  మామాడిపల్లి చౌరస్తా వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలతో కలిసి అర్వింద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెర్కిట్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... ఎంపీ ల్యాడ్స్ నిధులతో నందిపేటలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే.. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవడం దుర్మార్గమని, కేంద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేయ‌డం టీఆర్ఎస్  నేత‌లు ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణుల యత్నించడంతో.. సీపీ నాగరాజుకు ఫోన్‌లో పరిస్థితిని వివరించినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. అయినా  స్పందన లేకపోవడంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్దికి టీఆర్ఎస్ అడ్డు పడుతున్నది.. తనకు కాదనీ ఎంపీ అర్వింద్ విమర్శించారు.

కోవిడ్ రూల్స్ బీజేపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయా? అని అర్వింద్ ప్రశ్నించారు. బీజేపీ నేత‌ల‌ను అడ్డుకుంటునే పోలీసులు,.. మ‌రీ.. అధికార పార్టీ నేత‌ల‌ను ఎందుకు అడ్డుకోవ‌డం లేద‌ని  ఎంపీ ధర్మపురి అర్వింద్ నిల‌దీశారు.టీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు పోలీసులకు కనిపించడం లేదా? అని అర్వింద్ ప్రశ్నించారు. కరీంనగర్లో బండి సంజయ్ దీక్ష చేస్తే.. కోవిడ్ నిబంధనలు ఉంటాయ‌నీ, కోవిడ్ నిబంధ‌న  సాకుతో గ్యాస్ కట్టర్లతో చొచ్చుకెళ్లిన గేట్లు బ‌ద్ద‌లు కొట్ట‌వ‌చ్చు.. కానీ,  నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు తమపై దాడులకు పాల్పడేందుకు కత్తులు, ఇనుపరాడ్లు పట్టుకుని ఆలూరు చౌరస్తాలో నిల్చుంటే కనిపించడం లేదా? అని నిలదీశారు.

click me!