పరీక్ష రాసే విద్యార్థుల కోసం నిజాం సాగర్ డ్యామ్ గేట్లు మూసేశారు.. కెనాల్‌లోనే ఆసరా పింఛన్లు

By telugu teamFirst Published Oct 2, 2021, 4:52 PM IST
Highlights

ముగ్గురు డిగ్రీ విద్యార్థులు పరీక్ష రాయడం కోసం నిజాం సాగర్ డ్యామ్ గేట్లను మూసేశారు. తద్వారా కెనాల్‌లో వాటర్ వెనక్కి వెళ్లడంతో వారు పరీక్ష రాశారు. ఇదే సమయంలో ఆ ఊరి ప్రజలు నిత్యావసరాలను మరో ఊరి నుంచి కొనుక్కుని వెళ్లారు. ఆసరా పింఛన్‌లనూ ఆ కెనాల్‌లోనే పంచారు.
 

హైదరాబాద్: వర్షాకాలం వచ్చిందంటే ఆ ఊరి ప్రజలు సమస్యలతో చితికిపోతారు. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు రవాణా సదుపాయాలనూ కోల్పోతారు. వర్షాకాలంలో నిజాం సాగర్ డ్యాం గేట్లు ఎత్తితే కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామ ప్రజల పడే అవస్తలు ఇవే. మంజీర నది, నిజాం సాగర్ డ్యామ్‌ల మధ్య ఈ ఊరు ఉన్నది. డ్యామ్ గేట్లు ఎత్తేయడం వల్ల ఊరుదాటే పరిస్థితి లేదు. ఈ సందర్భంలోనే ముగ్గురు డిగ్రీ విద్యార్థులు వారి పరీక్ష రాయడం కోసం నిజాం సాగర్ గేట్లను మూసేశారు. అంతేకాదు, ఇదే అదనుగా అధికారులు ఆసరా పింఛన్లనూ పంచారు. గ్రామస్తులు నిత్యావసర సరుకులను కొనుక్కుని తమ ఇళ్లల్లోకి తీసుకెళ్లారు.

ముగ్గురు విద్యార్థులు తిరుపతి, నిఖిత, ముక్త బాయ్‌ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, డ్యాం గేట్లు ఎత్తడం వల్ల ఊరుదాటే పరిస్థితి లేదు. గత శనివారం నుంచి ఇదే పరిస్థితి. పరీక్ష రాయడానికి ఎలా వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడిపోయారు. డ్యామ్‌లోకి వరద నీరు విస్తారంగా రావడంతో అధికారులు నీటిని విడుదల చేయడానిక గేట్లు ఎత్తేశారు. దీంతో కుర్తి గ్రామం చుట్టూ నీరుతో ఒంటరిదైపోయింది. 

ఆ విద్యార్థులు తమ గోడును తహిశీల్దార్ రామ్మోహన్ రావుకు తెలియజేశారు. ఆయన విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపారు. నీటిని కొంతకాలం విడుదల చేయవద్దని అభ్యర్థించాడు. ఇందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో విద్యార్థులు తమ పరీక్ష శుక్రవారం రాసేశారు. 

ఇదే అదనుగా భావించిన గ్రామస్తులు కెనాల్ గుండా బయటికి వెళ్లి నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకున్నారు. అదే సమయంలో మండల పరిషద్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర రావు ఆసరా పింఛన్‌లను పంచారు. నీరు వెనక్కి తగ్గిన నేపథ్యంలోనే ఆయన కెనాల్‌లోనే పింఛన్లు పంచారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమయానుకూలంగా, సరైన నిర్ణయం తీసుకుని తమ సమస్యలను పరిష్కరించినందుకు గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

click me!