తెలుగు అకాడమీలో ఔట్ సోర్సింగ్ బాగోతం: కోట్లాది రూపాయలు వృధా

By telugu teamFirst Published Oct 2, 2021, 3:54 PM IST
Highlights

భద్రత చూసుకోవాల్సిన నిధుల విషయంలోనే తెలుగు అకాడమీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే, ఇతర విషయాల్లో యాజమాన్యం తీరు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ వ్యవహారం అందుకు ఓ ఉదాహరణ.

హైదరాబాద్: నిధుల గోల్ మాల్ వ్యవహారంలో తెలుగు అకాడమీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం బయటపడింది. ఇతర వ్యవహారాల్లోనూ ఇదే నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కొరవడుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమీ వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అకడమిక్ విభాగానికి, అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి మధ్య పూడ్చలేని గండి ఏర్పడింది. అకడమిషియన్ల పరిస్థితి దారుణంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులతో పనిచేయించుకోవడం అకడమిషయన్లకు చాలా కష్టంగా మారింది.

యాజమాన్యం పట్టించుకోకపోవడం, తనకు ఏ విధమైన సంబంధం లేని విధంగా వ్యవహరించడం వల్ల అన్యాయానికి గురైన ప్రస్తుత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గత దినసరి వేతన ఉద్యోగులు అకడమిషయన్లకు గతంలో మాదిరిగా సహకరించడం మానేశారనే అభిప్రాయం ఉంది. తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు అర్థరాత్రి వరకు పనిచేసిన సందర్భం ఉంది. అందుకు వారికి అదనంగా వచ్చిన నగదు ప్రయోజనం కూడా ఏమీ లేదు. కానీ దినసరి వేతనంపై పనిచేస్తూ సంస్థ తమదని భావించడం వల్ల, అప్పటి డైరెక్టర్ చొరవ వల్ల వారు అలా పనిచేస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు మొత్తం యాంత్రికమైన పరిస్థితి నెలకొని ఉంది. 

See Video: తెలుగు అకాడమీ దినసరి వేతన ఉద్యోగుల ధర్నా (వీడియో)

దానికితోడు, దినసరివేతన ఉద్యోగుల పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు అత్యంత దయనీయంగా మారింది. అప్పనంగా వాళ్లు ఔట్ సోర్సింగ్ కంపెనీ కిందికి వెళ్లాల్సిన పరిస్థితిలో పడ్డారు. మరోవైపు, ఆంధ్ర దినసరి వేతన ఉద్యోగుల నుంచి పని తీసుకోకుండా వారికి వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో)గా, అకౌంట్స్ అఫీసర్ గా ఒక్కరే ఉండడం కూడా అకాడమీకి శాపంగా మారింది. అకాడమీ ఉన్నతాధికారిని, ఇతరులను తప్పుదోవ పట్టిస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల కోటికి పైగా రూపాయలు అకాడమీ నష్టపోవాల్సి వచ్చింది. 

తెలుగు అకాడమీలో దాదాపు 80 మంది దినసరి వేతన ఉద్యోగులు ఉండేవారు. కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర ఉద్యోగులు దినసరి వేతనంపై పనిచేస్తూ ఉండేవారు. 2019 డిసెంబర్ లో వారందరినీ ఔట్ సోర్సింగ్ కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని వారందరినీ అప్పనంగా ఓ సంస్థకు ప్రయోజనం చేకూర్చే పనిచేశారు. జిల్లా కలెక్టర్ జీవో ప్రకారం దినసరి వేతనాలను అకాడమీ చెల్లిస్తూ వచ్చింది. తొలుత రోజుకు 720 రూపాయల చొప్పున వేతనం చెల్లించేవారు. ఆ తర్వాత అది 900 రూపాయలకు పెరిగింది. తొలుత నెలకు 16  వేల పైచిలుకు చొప్పున ఒక దినసరి వేతన ఉద్యోగి అందుకు ఉండేవాడు. దినసరి వేతనం పెరిగిన తర్వాత దాదాపు నెలకు 23 వేల రూపాయల పైచిలుకు చెల్లించాల్సి వచ్చింది 

ఈ సమయంలో ఔట్ సోర్సింగ్ కంపెనీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఉన్న దినసరి వేతన ఉద్యోగులందరినీ ఆ కంపెనీ ఉద్యోగులుగా నమోదు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినసరి ఉద్యోగులకు అది నచ్చలేదు. ఔట్ సోర్సింగ్ కంపెనీ ఉద్యోగ నియామకాల్లో తెలుగు అకాడమీకి ఉపయోగపడిందేమీ లేదు. తెలుగు అకాడమీ ఔట్ సోర్సింగ్ సంస్థకు ఉపయోగపడింది. దాంతో ఔట్ సోర్సింగ్ కంపెనీ కమిషన్ పోను ఒక్కో ఉద్యోగికి నెలకు 15 వేల రూపాయలు, ఆ పైచిలుకు మాత్రమే లభించే పరిస్థితి ఏర్పడింది. 

దినసరి వేతన ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ సంస్థ కిందికి వెళ్లడానికి నిరాకరించిన క్రమంలో యాజమాన్యం వారిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. ఉద్యోగాలు పోతాయనే భయంతో తెలంగాణ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ కంపెనీకి కిందికి వెళ్లడానికి అంగీకరించారు. ఆంధ్రకు చెందిన దాదాపు 22 మంది మాత్రం అందుకు నిరాకరించి, ఒప్పందం మీద సంతకాలు చేయడానికి నిరాకరించారు. అకాడమీ నిర్ణయంపై అటు ఆంధ్ర ఉద్యోగులు, ఇటు తెలంగాణ ఉద్యోగులు వేర్వేరుగా కోర్టుకు ఎక్కారు. 

ఇది వరకే పనిచేస్తూ ఉన్న దినసరి వేతన ఉద్యోగులను కొనసాగిస్తూ కొత్త అవసరాల కోసం ఔట్ సోర్సింగ్ సంస్థలను ఆశ్రయించే పద్ధతి మామూలుగా ఇప్పటికీ కొన్ని సంస్థల్లో కొనసాగుతోంది. అలా కాకుండా ఉన్న తన ఉద్యోగులనే తెలుగు అకాడమీ ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించింది. ఇందులో మతలబు ఏమిటనేది తేలాల్సి ఉంది. 20, 24 ఏళ్ల నుంచి పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను కూడా ఆ సంస్థకు అప్పగించింది. 

ఆంధ్ర ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో అనివార్యంగా విభజనను అమలు చేయాల్సిన పరిస్థితిలో తెలుగు అకాడమీ పడింది. ఆంధ్ర దినసరి వేతన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన తీర్పు వచ్చింది. దినసరి వేతన ఉద్యోగులకు బకాయిలతో పాటు వేతనాలను చెల్లించాలని ఆదేశిస్తూ ఔట్ సోర్సింగ్ ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టర్లు కూర్చుని విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. 

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలుగు అకాడమీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఈ ఏడాది మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల తెలుగు అకాడమీకి కోటి రూపాయలకు పైగా వ్యయం కావడమే కాకుండా ఎదురు దెబ్బ కూడా తగిలింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు హైకోర్టు తీర్పులోని 53(సీ)ని వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం 53(సీ) మేరకు రెండు రాష్ట్రాల మధ్య 2వ తేదీలోపు పంపకాలు పూర్తి చేయాల్సి వచ్చింది. దానిపై ఇరు రాష్ట్రాల డైరెక్టర్ల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కు డబ్బులు చెల్లించాల్సి వచ్చేసరికి అకాడమీ డబ్బుల గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. దాని గురించి చాలావరకు అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 22 మంది దినసరి వేతన ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వచ్చింది. వారితో హడావిడిగా రిజిష్టర్ లో సంతకాలు చేయించుకుని వారికి వేతనాలు చెల్లించలేదు. వారితో పనిచేయించుకోలేక పోగా, వారికి వేతనాలు చెల్లించాల్సిన అనివార్యత యాజమాన్యం తప్పుడు విధానాల వల్ల జరిగింది. 

అదే సమయంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ఉద్యోగులకు వర్తింపజేయడం లేదు. వారిని తిరిగి దినసరి వేతన ఉద్యోగుల జాబితాలో చేర్చలేదు. దానివల్ల తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. హైకోర్టు తీర్పు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇరు ప్రాంతాల దినసరి వేతన ఉద్యోగులకు వర్తింపజేయాలనే విషయాన్ని యాజమాన్యం పక్కనపడేసింది. 

ఏ మాత్రం లక్ష్యం లేకుండా, భద్రతను చూసుకోకుండా ఆషామాషిగా దాదాపు 34 బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎలా చేశారో, దినసరి వేతన ఉద్యోగుల విషయంలోనూ అలాగే వ్యవహరించారు. ఏకపక్ష నిర్ణయాలు, పారదర్శకతా లోపం, నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ఇలా తవ్వుకుంటూ పోతే తెలుగు అకాడమీ లోపాలు ఒక్కటొక్కటే బయటపడుతాయి. 

click me!