
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. అదనపు కోట్నం కోసం భర్త వేధించడంతో.. నవ వధువు అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన వంగ భారతికి.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కె రమేష్‌తో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. భారతి స్త్రీ వైద్య నిపుణురాలు కాగా.. రమేష్ పిల్లల డాక్టర్. వీరు గత ఆరు నెలలుగా సుర్యోదయ నగర్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లైనా తర్వాత కొన్ని నెలల పాటు వీరి జీవితం బాగానే సాగింది. అయితే ఇటీవల రమేశ్.. భారతిని వేధించడం మొదలుపెట్టాడు.
ఇద్దరం కలిసి హాస్పిటల్ పెడదామని.. ఇందుకోసం అదనపు కట్నం తీసుకురావాలని భారతిని రమేష్ ఒత్తిడి చేశాడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా.. మద్యం తాగొచ్చి హింసించేవాడు. ఈ క్రమంలోనే భారతి 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయితే పెద్దలు సర్దిచెప్పడంతో వారం క్రితం తిరిగి భర్త వద్దకు వచ్చింది.
శుక్రవారం రాత్రి భారతి తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు అల్లుడు రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో రమేష్ తాను హాస్పిటల్ ఉన్నానని.. ఇంటికి వెళ్లి చెబుతునానని అన్నాడు. ఆ తర్వాత రమేష్.. భారతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్‌బీ నగర్ పోలీసులు అక్కడకు చేరుకని వివరాలు సేకరించారు. భారతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
రమేశ్ వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని భారతి తండ్రి శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.