కొడంగల్ లో సంచలనం రేపిన పదకొండేళ్ల బాలుడి హత్య విషయంలో నరబలి కాదని.. డబ్బుకోసమే హత్య చేశారని తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొడంగల్ : వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన బాలుడి నరబలి అనుమానిత కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశతో అన్నెం పుణ్యం ఎరుగని ఓ బాలుడిని దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. ఆ పసివాడిని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కోటిరెడ్డి సోమవారం వెల్లడించిన వివరాల మేరకు.. పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అజయ్ (19) జులాయిగా తిరుగుతూ ఉండేవాడు.
కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమీపంలోని మిట్టిబోలి కాలనీకి చెందిన రజా ఖాన్(11) అనే బాలుడిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులతో కొద్దిరోజులుగా స్నేహం నటిస్తూ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. శనివారం సాయంత్రం రజాఖాన్ ను స్కూటీ ఎక్కించుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ‘మీ అమ్మనాన్నకు ఫోన్ చేస్తాను. ఏమీ మాట్లాడకు..’ అని ఆ బాలుడికి చెప్పడంతో అతను భయపడి కేకలు వేశాడు.
షాకింగ్... కొడంగల్ లో పదేళ్ల బాలుడి దారుణ హత్య : బలి ఇచ్చారనే అనుమానాలు
ఈ విషయం బయటకు పొక్కుతుందని భయపడిన అజయ్ సుత్తితో బాలుడి తలపై బలంగా కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేస్ లో పెట్టి అర్ధరాత్రి వేళ సమీపంలోని చెత్త ప్రదేశంలో పడేశాడు. అజయ్ వెంట బాలుడు వెళ్లడాన్ని చూసిన కాలనీ వాసులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. డబ్బుకోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. గతంలో హైదరాబాదులో రూ.25 లక్షల దొంగతనం కేసులోనూ అజయ్ నిందితుడని పోలీసులు తెలిపారు.
సోమవారం తెల్లవారు జామున మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. బాలుడి హత్య ఘటన వెలుగుచూడటంతో కొడంగల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో పోలీస్స్టేషన్ ముందు, ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరడంతో పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.