కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్లే సమస్యలా

First Published Nov 12, 2016, 10:07 AM IST
Highlights

రద్దైన వెయ్యి రూపాయల సైజ్ కన్నా కొత్త 2 వేల నోట్లు సైజ్ లో చిన్నవి కావటంతో ఏటిఎం సాఫ్ట్ వేర్లు పనిచేయక ఏటిఎంల్లో నుండి నోట్లు బయటకు రావటం లేదు.

పెద్ద నోట్ల రద్దు లాంటి నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం హటాత్తుగా తీసుకోవటం అనాలోచిత చర్యగా కనబడుతోంది. ప్రజల్లో బాగా చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్ల బుధవారం రాత్రి ప్రధానమంత్రి ప్రకటించటంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాత్రి కావటంతో అప్పటికి బయటపడకపోయినా గురువారం మధ్యాహ్నం అయ్యేటప్పటికి సమస్య తీవ్రత యావత్ దేశాన్ని పట్టి కుదిపేసింది. అప్పటి నుండి సమస్యల పరంపర శనివారం సాయంత్రమైనా తగ్గకపోగా మరింత పెరుగుతుండటం గమనార్హం.

  దానికి ప్రధాన కారణం పెద్ద నోట్లను రద్దు చేసే ఆలోచన ఉన్నపుడు దానికి ముందుజాగ్రత్తలు తీసుకోకపోవటం. సమాజంలో చెలామణిలో ఉన్న నోట్లలో వెయ్యి, 500 నోట్ల శాతమే అధికం. అటువంటిది వాటిని రద్దు చేయటంతో చిన్న నోట్లు ప్రజల వద్ద అందుబాటులో లేకుండాపోయాయి. దాంతోనే సమస్య మొదలైంది. దానికి తోడు బ్యాంకు, ఏటిఎంలను ఒకటి, రెండు రోజుల పాటు మూసేసినా ప్రజలకు అవసరమైన నగదు నిల్వలను సరఫరా చేయలేకపోయింది.

  పెద్ద  నోట్ల రద్దుతో ప్రజలకు వంద, 50, 20, 10 రూపాయలను అందుబాటులోకి తేవాల్సిన కేంద్రం మళ్ళీ 2 వేలు, 500 నోట్ల పంపిణీపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. 2 వేలు, 500 రూపాయలను ప్రజలు తీసుకుంటున్న మార్కెట్లో వాటికి చిల్లర దొరకకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. దాంతో ప్రజలందరూ పెద్ద నోట్లకు బదులు 100, 50 రూపాయలే కావాలని అడుగుతుండటంతో బ్యాంకుల వద్ద ఉన్న రూ. 100 నిల్వలు అయిపోయాయి. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.

  దానికి తోడు పాత 1000 రూపాయల నోట్లకు కొత్తగా ముద్రించిన 2 వేల నోట్ల సైజ్ లో తేడావుంది. రద్దైన వెయ్యి రూపాయల సైజ్ కన్నా కొత్త 2 వేల నోట్లు సైజ్ లో చిన్నవి కావటంతో ఏటిఎం సాఫ్ట్ వేర్లు పనిచేయక ఏటిఎంల్లో నుండి నోట్లు బయటకు రావటం లేదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కనీసం నెల రోజులు పడుతుందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. దానికి తోడు బ్యాంకుల్లో కూడా అవసరాలకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో అదనపు కౌంటర్లు కూడా చాలా బ్యాకుంల్లో ఏర్పాటు కాలేదు. ఫలితంగా ఖాతాదారులు గంటల తరబడి క్యూలైన్లలోనే నిలబడాల్సి వస్తోంది.

ఇదిలావుండగా, కొత్త 2 వేల నోట్లలో అదనంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చర్యలు కూడా ఏమీ లేవని సమాచారం. దానికితోడు నోట్లపై స్పల్లింగ్ మిస్టేక్ లు కూడా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. హడావుడిగా 2 వేల నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలన్న కేంద్రం అనాలోచిత నర్ణయమే దేశ ప్రజల ప్రస్తుత సమస్యలకు కారణాలుగా పలువురు మండిపడుతున్నారు.

 

click me!