నేరేడుచర్ల వివాదం: ఉత్తమ్, కేవీపీల అరెస్ట్, మిర్యాలగుడాకు తరలింపు

By telugu teamFirst Published Jan 28, 2020, 12:46 PM IST
Highlights

నేరేడుచర్ల చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు నేతలు ధర్నాకు దిగారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కేవీపీ రామచందర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

సూర్యాపేట: ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఓటుతో నేరేడుచర్ల చైర్మన్ పదవిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుచుకోవడంతో ఆగ్రహించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు ఆందోళనకు దిగారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని మిర్యాగుడాకు తరలించారు.  

కేవీపీ రామచందర్ రావుకు ఓటు హక్కు కల్పించిన తర్వాత ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ఓటు కల్పించడంతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. సుభాష్ రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెసు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన ఆయనకు ఓటు హక్కు ఎలా కల్పిస్తారంటూ కాంగ్రెసు నిలదీసింది.

Also Read: ఉత్తమ్‌కు షాక్: టీఆర్ఎస్ వశమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ

చైర్మన్ ఎన్నిక ప్రక్రియను కాంగ్రెసు బహిష్కరించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస నేతలు ఆందోళనకు దిగారు.  నిన్నటి జాబితా ప్రకారమే ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. పేర్ని సుభాష్ రెడ్డికి చివరి నిమిషంలో ఓటు హక్కు ఎలా కల్పిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు 

సుభాష్ రెడ్డికి ఓటు హక్కు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ వినతి పత్రాలను కూడా ఈసీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ నియంత పోకడలు పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.

Also Read: నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: శేరి సుభాష్ రెడ్డికి ఓటు, కాంగ్రెస్ అభ్యంతరం.

కేవీపీ రామచందర్ రావుకు ఓటు హక్కు కల్పించడంపై టీఆర్ఎస్ సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్ర గందరగోళం మధ్య చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. అయితే కేవీపీకీ ఓటు హక్కు ఉందని ఈసీ ధ్రువీకరించింది. ఈ స్థితిలో టీఆర్ఎస్, కాంగ్రెసు బలాబలాలు సమానమయ్యాయి. ఇరు పార్టీలకు పదేసి సభ్యుల బలం ఉంది. 

అయితే, అకస్మాత్తుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ఓటు కల్పించడంతో టీఆర్ఎస్ ది పైచేయి అయింది. చివరి నిమిషంలో సుభాష్ రెడ్డికి ఓటు హక్కు ఎలా ఇస్తారని కాంగ్రెసు ప్రశ్నిస్తూ ఎన్నికను బహిష్కరించింది.

click me!