కేసీఆర్ తీరు నాకేం అర్థం కావడం లేదు.. నాయిని ఆవేదన

By sivanagaprasad kodatiFirst Published Oct 12, 2018, 12:37 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలి తనకు అంతుబట్టడం లేదని.. మనసుకు చాలా కష్టంగా ఉందన్నారు తాజా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలి తనకు అంతుబట్టడం లేదని.. మనసుకు చాలా కష్టంగా ఉందన్నారు తాజా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తానెక్కడికి వెళ్లినా తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఏమైందనే అడుగుతున్నారని.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు బంధుమిత్రులు పదే పదే ప్రశ్నిస్తున్నారని నాయిని అన్నారు..

ముషీరాబాద్ టికెట్ తన అల్లుడికి కేటాయించడంలో కేసీఆర్ ఎటూ తేల్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తన అల్లుడికి ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని వివరించారు..

శ్రీనివాస్ రెడ్డికి టికెట్ గురించి ఇప్పటికే కేటీఆర్‌ను రెండుసార్లు కలిశానని.. అయితే తనతో మాట్లాడిన తర్వాతే టికెట్‌పై నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానని గట్టిగా చెబితే.. కేసీఆర్ వద్దని వారించారని.. గతంలో ఇక్కడ ఓడగొట్టారని.. కాబట్టి ఈసారి ఎల్బీ నగర్ నుంచి బరిలోకి దిగాలని సూచించినట్లుగా కేసీఆర్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు.

నాడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి హోంమంత్రిగా నియమించారని నాయిని అన్నారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే అన్ని విషయాలు ఆయనతో చర్చిస్తానని.. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని పోటీ చేయించాలని స్థానిక టీఆర్ఎస్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో పాటు... ఒకవేళ అల్లుడికి గనుక ఇవ్వకపోతే తానే ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నాయిని గట్టి పట్టుదలతో వుండటంతో కేసీఆర్ ఆ స్థానంపై నిర్ణయం తీసుకోలేదు... 

అల్లుడికి హమీ ఇచ్చారు, ఆ సీటు నాకే కావాలి: నాయిని
 

click me!