ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణకు సహకరించని నందూ భార్య, లాయర్ ప్రతాప్ గౌడ్

By Siva KodatiFirst Published Nov 25, 2022, 7:53 PM IST
Highlights

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందూ భార్య చిత్రలేఖ, లాయర్ ప్రతాప్ గౌడ్‌ను సిట్ విచారించింది. స్వామిజీతో దిగిన ఫోటోలు, కాల్ డేటా ఆధారంగా సిట్ ప్రశ్నలు సంధించింది. అయితే వీరిద్దరూ విచారణకు సహకరించలేదని సమాచారం. 

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందూ భార్య చిత్రలేఖ, లాయర్ ప్రతాప్ గౌడ్‌ను విచారించింది. దాదాపు 8 గంటలకు పైగా వీరిద్దరి సిట్ బృందం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పలు వివరాలను సేకరించింది. స్వామిజీతో దిగిన ఫోటోలు, కాల్ డేటా ఆధారంగా సిట్ ప్రశ్నలు సంధించింది. అయితే వీరిద్దరూ విచారణకు సహకరించలేదని సమాచారం. ఫోటోలు, కాల్‌డేటాపై చిత్రలేఖ నోరు మెదపలేదని తెలుస్తోంది. అటు ప్రతాప్ గౌడ్ కూడా పోలీసుల ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారని సమాచారం. దీంతో ఆయనను రేపు మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించారు. అలాగే చిత్రలేఖను సోమవారం రావాల్సిందిగా చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఇకపోతే... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  ముగ్గురు నిందితులు  హైకోర్టులో  శుక్రవారంనాడు   బెయిల్  పిటిషన్లు దాఖలు  చేసిన సంగతి తెలిసిందే.   గతంలో  ఈ ముగ్గురు నిందితులు  ఏసీబీ కోర్టులో దాఖలు  చేసిన బెయిల్  పిటిషన్లను  ఏసీబీ కోర్టు  కొట్టివేసింది.  దీంతో  నిందితులు హైకోర్టులో  పిటిషన్  దాఖలు  చేశారు. ఇదే  విషయమై నిందితులు  గతంలో సుప్రీంకోర్టులో  కూడా  బెయిల్  పిటిషన్  దాఖలు  చేశారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులోనే  బెయిల్ పిటిషన్ దాఖలు  చేయాలని షుప్రీంకోర్టు  సూచించింది.  దీంతో  నిందితులు  ముగ్గురు  ఇవాళ  తెలంగాణ  హైకోర్టులో  బెయిల్  పిటిషన్లు  దాఖలు  చేశారు.ఈ  పిటిషన్  పై  తెలంగాణ హైకోర్టు రేపు  విచారణ నిర్వహించే అవకాశం  ఉంది.

ALso REad:బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కి హైకోర్టులో ఊరట: సిట్ నోటీసులపై స్టే

గత  నెల  26వ తేదీన  రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్  లను  మొయినాబాద్  పోలీసులు  అరెస్ట్  చేశారు. టీఆర్ఎస్  కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురిచేశారని  నమోదైన  కేసులో  ఈ  ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక  ఎమ్మెల్యే  రేగా  కాంతారావు, తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డిలను   ఈ  ముగ్గురు  ప్రలోభాలకు  గురి చేశారని  ఆరోపణలున్నాయి,.  ఈ  మేరకు   రోహిత్  రెడ్డి   పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. ఈ  ఫిర్యాదు  ఆధారంగా  ఈ ముగ్గురిని  పోలీసులు  అరెస్ట్ చేశారు. ఇప్పటికే  ఈ కేసులో  ఈ  ఇద్దరిని పోలీసులు  రెండు  రోజుల పాటు  కస్టడీలోకి తీసుకొని విచారించారు. మరో  వైపు  మరో  10 రోజుల పాటు  ఈ  ముగ్గురిని  కస్టడీ కోరుతూ  సిట్  దాఖలు  చేసిన పిటిషన్ ను ఏసీబీ  కోర్టు  కొట్టివేసింది.  

click me!