
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ నాయకురాలు నందమూరి సుహాసిని ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలుగా ఉన్న నందమూరి సుహాసిని.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాల గురించి చంద్రబాబుతో చర్చించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ వివరాలను వెల్లడించింది. ఇక, ప్రస్తుతం నందమూరి సుహాసిని టీటీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు.. తెలంగాణ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి పలు సూచనలు చేశారు. రాజకీయాన్ని వ్యాపారంగా తానెప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని, దానిని వివరించి వారి ఆదరణ పొందాలని సూచించారు. టీడీపీ సభ్యత్వం తెలుగువారి ఆత్మగౌరవానికి సంకేతమన్నారు. సభ్యత్వం గురించి ప్రచారం చేయడం ప్రతి కార్యకర్త కర్తవ్యంగా, సభ్యత్వ నమోదు ప్రతినాయకుడి బాధ్యతగా పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ ఓటుబ్యాంకును కాపాడుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలను వివరించడానికి నందమూరి సుహాసిని చంద్రబాబుతో కలిశారు. సభ్యత్వ నమోదుజరుగుతున్న తీరు, తెలంగాణ పార్టీ పరిస్థితిపై ఆమె చంద్రబాబుతో చర్చించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. ఆమెకు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచారు. ఇంటింటికి తిరుగుతూ గెలుపు కోసం బాగానే శ్రమించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో సుహాసిని తెలుగు ప్రసంగాలపై విమర్శలు రాగా.. ఆమె వాటికి కౌంటర్ ఇచ్చారు.
“నేను తెలుగులో అనర్గళంగా మాట్లాడగలను.. కానీ నాకు రాజకీయ పదజాలం అలవాటు లేదు. మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో ఇంగ్లీషు పదాలను ఉపయోగించకూడదని చెప్పడంతో నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. నేను హైదరాబాదులో చదివాను, ఇంట్లో మేము తెలుగు మాట్లాడతాం’’ అని సుహాసిని ఎన్నికల సమయంలో చెప్పారు.
ఇక, తెలంగాణలో టీడీపీ పరిస్థితి దాదాపు కనుమరుగైనట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లలో గెలుపొందగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిలో చాలా మంది ఇతర పార్టీల కండువా కప్పుకున్నారు. పార్టీలోని కింది స్థాయి నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇక, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వారు టీడీపీని వీడి అధికార టీఆర్ఎస్‌లో చేరారు.
ఇక, తెలంగాణ ఏర్పాటు తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్ రమణ్ కూడా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షునిగా బక్కని నర్సింహులు కొనసాగుతున్న.. ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఇక, టీటీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి నాయకులు ఉన్నారు. అందులో రావుల యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం టీటీడీపీ ఆశలు మాత్రం వదులుకొలేదనే సంకేతాలు పంపిస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా టీటీడీపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి.. వారికి సూచనలు చేస్తుంటారు. అలాగే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.