వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించనుంది.
హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. మంగళవారంనాడు మధ్యాహ్నం బెయిల్ పై నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించనుంది. పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వైఎస్ షర్మిలకు నిన్న రాత్రి ఈ ఏడాది మే 9వ తేదీ వరకు జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. షర్మిలకు జ్యుడీషీయల్ రిమాండ్ విధించిన తర్వాత వైఎస్ షర్మిల తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని నాంపల్లి కోర్టు నిన్న ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్పించారు.
also read:ప్రశ్నించేవారిని ఎంతకాలం అణచివేస్తారు: కేసీఆర్ సర్కార్ పై వైఎస్ విజయమ్మ ఫైర్
41 సీఆర్‌పీఎస్ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని వైఎస్ షర్మిల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుుకెళ్లారు. వైఎస్ షర్మిల అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. షర్మిల చేయి చేసుకున్న వీడియోను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని షర్మిల తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులపై దాడి కంటే ముందు చోటు చేసుకున్న వీడియోల ను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్ షర్మిల తరపు న్యాయవాది వాదనలు విన్పించారు.
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిలకు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. నిన్న కోర్టు ఆదేశం మేరకు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ పై కూడా ఇరువర్గాల వాదనలను కోర్టు విన్నది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా నాంపల్లి కోర్టు తెలిపింది.