జానారెడ్డి రాజకీయాల నుండి తప్పుకొంటే మంచిది: గుత్తా

First Published Jul 16, 2018, 11:16 AM IST
Highlights

 వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రధర్శిస్తున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
సోమవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. 

నల్గొండ: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రధర్శిస్తున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
సోమవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు  అజ్ఞానుల మాదిరిగా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టిన  తెలంగాణ ప్రభుత్వంపై  విమర్శలు చేసే నైతిక హక్కు  కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని ఆయన చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రైతాంగం సంక్షేమం కోసం  టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను  చేపడుతోందని చెప్పారు. రైతాంగానికి  మద్దతు ధర కల్పించడంతో పాటు  ఇతర సౌకర్యాలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  పలు కార్యక్రమాలను  కేంద్ర ప్రభుత్వంతో పాటు  ఇతర రాష్ట్రాలు కూడ ఆదర్శంగా  తీసుకొంటున్న విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు.అధికారంలో ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు  ప్రజల సమస్యలను పరిష్కరించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్న అజ్ఞానైతే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువుకోని అజ్ఞాని అని విమర్శించారు. 

ఉత్తమ్ కుమార్ కుటుంబం నుంచి ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని... మరి వీరిది ఫ్యామిలీ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కలల్లో విహరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు


 

click me!