తన భార్య సుజాత ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె భర్త నాగేశ్వరరావు కోరారు.
హైదరాబాద్: తన భార్య ఆత్మహత్యపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వ టీచర్ సుజాత భర్త నాగేశ్వరరావు చెప్పారు. విచారణలో తేలిన వాస్తవాలను రాయాలని ఆయన మీడియాను కోరారు. మీడియాలో పలు రకాలుగా కథనాలు రావడంతో తాను షాక్ కు గురైనట్టుగా ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. హయత్ నగర్ శివారు కుంట్లూరులో రాజేష్ అనుమానాస్పద మృతికి ప్రభుత్వ టీచర్ సుజాత ఆత్మహత్యకు సంబంధం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై సుజాత భర్త నాగేశ్వరరావు స్పందించారు. ఈ నెల 24వ తేదీన తన భార్య సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన భార్య సుజాత ఆత్మహత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సుజాత, రాజేష్ మధ్య ఎప్పటి నుండి పరిచయం అనే విషయమై కూడా పోలీసులు తేల్చాలని ఆయన కోరారు. తన భార్య సుజాతను ఎవరో ట్రాప్ చేసి ఉంటారని నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. తన భార్యను మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశారా అనే విషయాన్ని తేల్చాలని ఆయన పోలీసులను కోరారు. ఈ విషయమై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నాగేశ్వరరావు తెలిపారు. పోలీసుల విచారణ పూర్తయ్యేవరకు ఏది పడితే అది రాయవద్దని మీడియాను నాగేశ్వరరావు కోరారు.
తన భార్య ప్రవర్తనపై తమకు ఎలాంటి అనుమానం రాలేదన్నారు. ప్రతి రోజూ తన భార్య తల్లి, సోదరుడు తమ ఇంటికి వచ్చేవారన్నారు. ఏదైనా ఇబ్బందులుంటే ఆమె వారితో షేర్ చేసుకొనేదన్నారు. కానీ ఏనాడూ ఈ విషయాలపై ఆమె మాట్లాడలేదన్నారు.
పురుగులమందు తాగిన తర్వాత కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగినట్టుగా ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొందన్నారు. తమకు కూడా ఏ విషయాలు కూడ చెప్పలేదని నాగేశ్వరావు చెప్పారు. తన భార్య పురుగుల మందు తాగిన సమయంలో తాను కూడా ఇంట్లోనే ఉన్నానని ఆయన చెప్పారు.
అనుమానం ఉంటే ఫోన్లు చెక్ చేస్తామన్నారు. తన భార్యపై ఏనాడూ అనుమానం రాలేదని నాగేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమెకు అకౌంట్స్ ఉండి ఉండొచ్చన్నారు. తన భార్య ఆత్మహత్య వెనుక కారణాలను వెలికి తీయాలని నాగేశ్వరరావు పోలీసులను కోరుతున్నారు.