తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం

By narsimha lode  |  First Published May 30, 2023, 9:40 AM IST

అకాల వర్షాలు  రైతుల నడ్డి విరించాయి.  కొనుగోలు  కేంద్రాల్లో  ధాన్యం తడిసిపోయింది.  20  రోజులకు పైగా  ధాన్యం  కొనుగోలు  కేంద్రాల్లోనే  ఉంది.


హైదరాబాద్: తెలంగాణలో  పలు జిల్లాల్లో  సోమవారంనాడు అర్ధరాత్రి నుండి  మంగళవారంనాడు ఉదయం వరకు  వర్షం  కురిసింది.  ఈ వర్షం కారణంగా  కొనుగోలు  కేంద్రాల్లోని వరి ధాన్యం  తడిసి  ముద్దయింది. సకాలంలో ధాన్యం కొనుగోలు  చేస్తే  ఈ పరిస్థితి  వచ్చేది కాదని  రైతులు  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.  కొనుగోలు  కేంద్రాల్లోనే  సుమారు  20  రోజులకు పైగా  ధాన్యం    ఉందని  రైతులు గుర్తు  చేస్తున్నారు.  ధాన్యం కొనుగోలు   విషయంలో  అధికారులు  మీన మేషాలు  లెక్కిస్తున్నారని  రైతులు  విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలోని జగిత్యాల  జిల్లా  కోరుట్లలోని  కొనుగోలు  కేంద్రంలో  ధాన్యం  తడిసింది.  వరంగల్ లో  ఉరుములు , మెరుపులతో  భారీ  వర్షం కురిసింది. నల్గొండ, నిజామాబాద్,  కామారెడ్డిలలో వర్షం కురిసింది. ఖమ్మం  కారేపల్లి మండలంలో  వర్షం కురిసిందని  వాతావరణ శాఖ ప్రకటించింది.  ఆయా ప్రాంతాల్లోని  కొనుగోలు  కేంద్రాల్లో  వరి ధాన్యం  తడిసింది.

Latest Videos

ఉమ్మడి  ఆదిలాబాద్  జిల్లాలోని  మంచిర్యాల జిల్లా  లక్సెట్టిపేట. దండేపల్లి మండలాల్లో  ఈదురు గాలులకు చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.  విద్యుత్  స్థంబాలు  కూలిపోయాయి. దీంతో  విద్యుత్  సరఫరాకు  అంతరాయం ఏర్పడింది.  నిర్మల్  జిల్లా ఖానాపూర్, కడెం  మండలాల్లో వర్షం కురిసింది.  సిద్దిపేట  జిల్లాలో మంగళవారం నాడు  ఉదయం వరకు   వర్షం  కురిసింది.  దీంతో  ధాన్యం  కొనుగోలు కేంద్రంలో  వరి  తడిసి  రైతులు  ఆందోళన చెందుతున్నారు.మంగళవారంనాడు  ఉదయంజనగాం,  సిద్దిపేట, యాదాద్రి  జిల్లాల్లో   వర్షం పడే  అవకాశం  ఉందని   వాతావరణ శాఖ  హెచ్చరించింది. 

ఏపీలో  కూడా వర్షాలు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని కర్నూల్  జిల్లాలోని  ఆదోనిలో  ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.  ఇవాళ  ఉదయం కూడ  రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో వర్షం  కురిసే అవకాశం ఉందని  వాతావరణ  శాఖ  తెలిపింది.  శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, విశాఖ, కర్నూల్ జిల్లాల్లో  పిడుగులు పడే  అవకాశం ఉందని  వాతావరణ శాఖ  హెచ్చరించింది.

click me!