
నాగర్ కర్నూల్ : క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ప్రాణాలను కాపాడారు నాగర్ కర్నూల్ పోలీసులు. ప్రాణాపాయ స్ధితిలో అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు సరైన సమయంలో సిపిఆర్ అందించి బ్రతికించారు పోలీసులు. ఇలా చాకచక్యంగా వ్యవహరించిన మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు స్థానిక ప్రజలు, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.
నాగర్ కర్నూల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఓ కుటుంబం నివాసముంటోంది. కారణమేంటో తెలీదుగానీ ఈ కుటుంబానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో వున్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులు సాయం కోరారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వివాహిత కొన ఊపిరితో వుంది. హాస్పిటల్ కు తీసుకుని వెళ్లేవరకు ఆమె ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదని గ్రహించిన పోలీసులు ముందు ఆమెకు ప్రథక చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సిపిఆర్ చేసారు.
కొద్దిసేపు సిపిఆర్ చేయడంతో వివాహిత పరిస్థితి కాస్త మెరుగుపడి స్ఫృహలోకి వచ్చింది. ఇక ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సరైన సమయంలో ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read More తప్పిన ప్రమాదం: శృంగవృక్షంలో ఆర్టీసీ బస్సులో మంటలు,ప్రయాణీకులు సురక్షితం
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతుండటంతో అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా సిపిఆర్ ఎలా చేయాలో నిపుణులైన వైద్య సిబ్బందితో శిక్షణ ఇచ్చారు. దీంతో గుండెపోటుకు గురయిన వారినే కాకుండా ఇలా ప్రాణాపాయ స్థితిలో వున్నవారికి పోలీసులు ప్రథమచికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.
రోడ్లపై వెళుతుండగానో, బహిరంగ ప్రదేశాల్లోనో హార్ట్ స్ట్రోక్ కు గురయిన చాలామందిని పోలీసులు సిసిఆర్ చేసి కాపాడిన ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలా ఇటీవల వరంగల్ లో ఓ యువకున్ని కాపాడారు పోలీసులు.
వరంగల్ జిల్లా రేగొండ మండల పరిధిలో వంశీ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన అతడు గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో పడివున్న వంశీకి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. వెంటనే పోలీస్ వాహనంలో అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రజలు కూడా అభినందించారు.