నాగార్జున సిమెంట్స్‌ ఉద్యోగికి కరోనా: ఉద్యోగుల్లో కలకలం

By Siva Kodati  |  First Published Apr 13, 2020, 4:12 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు  అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది


ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు  అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం అతను గుంటూరులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ అనుమతి ఉందంటూ యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరిని నడిపినట్లుగా తెలుస్తోంది.

Latest Videos

తమతో పాటు పనిచేసిన వ్యక్తికి కోవిడ్ 19 సోకడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కాంటాక్ట్‌లను ట్రేస్ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మిగిలిన వారి శాంపిల్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 214 మంది వద్ద నుంచి కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించగా, ఇందులో 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇతర దేశాలు, ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి కరోనా బారినపడ్డ వారు కుటుంబసభ్యులతో పాటు వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు.

కరోనా సోకినవారితో పాటు వారి కుటుంబసభ్యులు, ఇతర అనుమానితులను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కాగా తెలంగాణలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల  సంఖ్య 532కి చేరింది. 

click me!