ప్లాష్ ప్లాష్...  బిజెపికి నాగం గుడ్ బై

First Published Mar 22, 2018, 4:54 PM IST
Highlights
  • ఇవాళే రాజీనామా లేఖ ఇవ్వనున్న నాగం
  • త్వరలోనే కాంగ్రెస్ తీర్థం
  • ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు చేసిన నాగం

తెలంగాణలో సీనియర్ రాజకీయ నేతగా నిలిచిన పాలమూరు జిల్లా నేత నాగం జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ సాయంత్రమే నాగం బిజెపికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

నాగర్ కర్నూలులో ఆయన తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా బిజెపి మీద కీలకమైన ఆరోపణలు చేశారు నాగం. తెలంగాణ రాష్ట్రలో బిజెపి ఎన్నటికీ అధికారంలోకి రాదని విమర్శించారు. బిజెపిని ఏ కోశాన కూడా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.

నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాలమూరు రాజకీయ నేతగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్ లో ఆయన పలుకీలక పోర్ట్ పోలియోలు నిర్వహించారు. అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి.. కొంతకాలం నగారా సమితి పేరుతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో కొనసాగారు.

అనంతర కాలంలో బిజెపిలో నాగం చేరిపోయారు. గత ఎన్నికల్లో తన ఆప్త మిత్రుడు, గురువు లాంటి వ్యక్తి అయిన జైపాల్ రెడ్డి మీద మహబూబ్ నగర్ పార్లమెంటుకు బిజెపి తరుపున పోటీ చేశారు. దీంతో ఇద్దరూ ఓడిపోయారు. ఎపి జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ తరుపున గెలిచారు.

ఇక ఎన్నికల తర్వాత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ బిజెపి నాయకత్వం ఆయనకు వెసులుబాటు ఇవ్వలేదు. దీంతో ఆయన కొంత కాలంగా బిజెపిలో సైలెంట్ గా ఉన్నారు. ఈ సమయంలోనే నాగం కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని నాగం ఖండించారు. కానీ తెర వెనుక మంతనాలు జరిగినట్లు చర్చ జరిగింది.

అంతిమంగా నాగం బిజెపిని వీడుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి 1969 ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు.  

click me!