
Munugodu by-election: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. ఎన్నికల్లో ఓటర్ల ప్రలోభపెట్టేవిధంగా డబ్బులు పంచుతున్నారని అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో ఓట్లను కొనేందుకు బీజేపీ అభ్యర్థి రూ.5.22 కోట్లు ఖర్చు చేశారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తూ.. దానికి సంబంధించిన ఖాతాలను సీజ్ చేయాలనీ, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఖాతాల డబ్బును స్తంభింపజేయాలని పేర్కొంది.
బీజేపీపై టీఆర్ఎస్ ఫిర్యాదు..
వివరాల్లోకెళ్తే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓట్ల కొనుగోలు కోసం వివిధ బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తాలను బదిలీ చేశారని ఆరోపిస్తూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) కు ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో, “బీజేపీ అభ్యర్థి కే రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ నుంచి మునుగోడు స్థానిక నివాసితులు/కంపెనీలు/సంస్థలకు డబ్బు బదిలీ చేసినట్లు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందనీ, ఓట్ల కొనుగోలుకు రూ. 5.22 కోట్లు వినియోగించారని అన్నారు.
రాజ్‌గోపాల్ కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా ద్వారా నిధుల వివరాలను బదిలీ చేసి మునుగోడు నియోజకవర్గంలోని వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేశారని టీఆర్‌ఎస్ నాయకుడు ఆరోపించారు. మునుగోడులో ఉన్న 23 బ్యాంకు ఖాతాలకు తన కంపెనీల నుంచి వ్యక్తుల కంపెనీలకు/ఫండ్‌లకు మరియు పార్టీ సభ్యులకు నిధుల బదిలీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. “ఈ గ్రహీతలు (డబ్బు) వివిధ రకాల వ్యాపారులు, వ్యక్తులు మొదలైనవారు ఉన్నారు. వీరికి బదిలీదారు కంపెనీతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. డబ్బు పొందిన కంపెనీల వ్యాపార వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీరంతా మునుగోడు నియోజకవర్గ వాసులు. అవి జరుగుతున్న విధంగా నిధుల బదిలీ చట్టవిరుద్ధం.. అలాగే, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా తీవ్రమైన ప్రాసిక్యూటబుల్ నేరం కూడా అని టీఆర్‌ఎస్‌కు చెందిన సోమ భరత్ కుమార్ అన్నారు.
ఫిర్యాదులో అందించిన ఖాతాలను సీజ్ చేయాలనీ, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఖాతాల నుంచి ఇతర ఖాతాల్లోకి వచ్చిన డబ్బును స్తంభింపజేయాలని ఆయన అన్నారు.“ఈ డబ్బు ఓట్లను కొనుగోలు చేయడానికి, చట్టవిరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది స్పష్టంగా ఉంది. ఈ ఖాతాల్లోకి నిధుల జాడను ఎత్తిచూపారు. ఇప్పటికే పంపిణీ చేయబడి ఉంటే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారనేది రికార్డుగా ఉంది. కాబట్టి, ఈ అధికార యంత్రాంగం ఎలాంటి జాప్యం లేకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు చేసే ఉద్దేశంతో ఈ ఖాతాలకు డబ్బును బదిలీ చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అవమానం, ఎన్నికల కమిషన్‌కు ఇది సవాలుగా ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి రూ.18 వేల కోట్ల బొగ్గు తవ్వకాల కాంట్రాక్టు దక్కిందనీ, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పై బీజేపీ ఫిర్యాదు..
అంతకుముందు టీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల్లో అధికారపార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.