సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి.ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ లో బారులు తీరారు.
మునుగోడు:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ నిలిచి పోయింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను ఓటర్లు ఈ పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. సంస్థాన్ నారాయణం స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 91,96లలో ఈవీఎంలు పనిచేయడం లేదు.దీంతో బీహెచ్ఈఎల్ అధికారులు ఈవీఎంలకు మరమ్మత్తులు చేస్తున్నారు.ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్ లోనే ఉన్నారు. ఈవీఎంలు రిపేర్ చేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు.
ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడ నియోజకవర్గంలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి నెలకొంది. మాక్ పోలింగ్ నిర్వహించే సమయంలో ఆరు ఈవీఎంలలో సమస్య తలెత్తింది. పోలింగ్ ప్రారంభమైనతర్వాత ఐదు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మొరాయించిన ఈవీఎంలను రిపేర్ చేసి పోలింగ్ తిరిగి ప్రారంభించడానికి ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం పట్టింది.
also read:చిన్నకొండూరులో మొరాయించిన ఈవీఎం: పోలింగ్ కేంద్రంలోనే కూర్చున్న ఓటర్లు
నియోజకవర్గంలోని కొంపల్లి,అల్లందేవిచెర్వు , చిన్నకొండూరుతో పాటు మరో రెండు గ్రామాల్లో ఇదే రకంగా ఈవీఎంలు మొరాయించాయి.ఇవాళ సాయంత్రం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో బీహెచ్ఈఎల్ ఇంజనీర్లు ఈవీఎంలను రిపేర్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.