Munugode Bypoll 2022: మునుగోడులో పక్కాగా కెసిఆర్ దళిత బంధు వ్యూహం

By Sumanth KanukulaFirst Published Aug 11, 2022, 10:28 AM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్‌ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్‌ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా, అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అంతా కలిసి పనిచేసేలా నాయకులు ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. అయితే మునుగోడులో విజయమే లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని.. నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు వర్తించే విధంగా (సాచురేషన్‌ మోడ్‌)‌లో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. 


మొదటి దశలో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు ఆర్థిక సాయం అందజేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే  మునుగోడు మండలంలోని జమస్తాన్‌పల్లి గ్రామంలో గత నెలలో మంత్రి జగదీష్ రెడ్డి.. దళితబంధు పథకం కింద ఎంపికైన 39 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. అయితే నియోజకవర్గంలోని దాదాపు 40,000 మంది దళిత ఓటర్లను లక్ష్యంగా చేసుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని, వారి మద్దతు తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఒక్క గ్రామాన్ని మాత్రమే కవర్ చేసినప్పటికీ.. నియోజకవర్గంలోని మొత్తం ఎస్సీ జనాభాను ఈ పథకం కింద చేర్చాలనే ఆలోచనను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ పథకం మొత్తం నియోజకవర్గంలో అమలు చేయబడుతుంది. సాచురేషన్‌ మోడ్‌ కవర్ చేయబడుతుంది’’ అని ఎస్సీ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపినట్టుగా డెక్కన్ క్రానికల్ పేర్కొంది. 

జమస్తాన్‌పల్లి కాకుండా.. ఈ పథకం కోసం సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని చిమిర్యాలలోని 35 దళిత కుంటాలను, గుడిమల్కాపూర్‌లోని 25 దళిత కుటుంబాలను గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఇవి కాకుండా.. నియోజకవర్గంలోని ఏ ఇతర గ్రామాలను ఈ పథకం కోసం జాబితా చేయలేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం.. దళిత బంధు లబ్దిదారులను నిర్ణయించడానికి ఎటువంటి అర్హత ప్రమాణాలు, స్పష్టమైన స్పెషిఫికేషన్స్‌ లేవని ఒక అధికారి పేర్కొన్నారు. తమకు ఇంకా స్పష్టమైన సూచనలు రాలేదని తెలిపారు. 

అయితే హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు దళిత బంధు అమలుకు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. అలాగే నియోజకర్గ అభివృద్దికి కూడా భారీగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో ఎలాంటి హడావుడి లేకుండా.. ప్రణాళికలను అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.


అయితే దళిత బంధు విషయంలో అధికార టీఆర్ఎస్ వైఖరిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు జరిగే చోట హుజురాబాద్‌ మాదిరిగానే దళిత బంధు వంటి ఉచిత పథకాలను అమలు చేయాలని చూస్తుందని బీజేపీ ఆరోపించింది. హుజురాబాద్‌లో 18,000 కుటుంబాల్లో కేవలం 400 కుటుంబాలు మాత్రమే దళిత బంధును ఆస్వాదించగలిగారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా విమర్శించారు. తర్వాత నిధులు స్తంభించిపోయాయని.. మిగిలిన కుటుంబాలకు అందుబాటులో లేవని చెప్పారు. 

దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికకు సంబంధించి సరైన మెకానిజం లేదని.. అందుకే టీఆర్ఎస్‌ నేతలు వారి సన్నిహితులకు లబ్దిచేకూర్చేలా పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

click me!