Munugodu bypoll 2022 : అమిత్ షా సభ తరువాత మునుగోడులోనే బీజేపీ మకాం..

By Bukka SumabalaFirst Published Aug 16, 2022, 1:00 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రతీపార్టీ ఆశిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ మునుగోడులోనే ఉండాలని నిర్ణయించుకుంది. 21న అమిత్ షా సభ తరువాత..22 నుంచి ఆ పార్టీ నేతలంతా మునుగోడులో మకాం వేయనున్నారు. 

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. తెలంగాణలోని మూడు పార్టీలూ ఈ ఉపఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికపై బిజెపి హై కమాండ్ ఫోకస్  పెట్టింది. ఈనెల 21న కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సభ  తర్వాత.. 22వ తేదీ నుంచి ఆ పార్టీ నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. Bypoll కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ వేయనుంది. కాగా, అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోనున్నారు. రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వంతో బీజేపీకి బలం చేకూరుతుందని బిజెపి అధిష్టానం భావిస్తోంది. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రానున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి మొదలైంది.  

మేమంటే మేమంటూ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీ వదిలి వెళ్లడంతో  నైరాశ్యం నుంచి బయటపడేసేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుల వ్యవధిలోనే బహిరంగ సభ నిర్వహించడంతో ఇతర పార్టీలు ఆ బాటలోనే పయనిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూద్దాం అనుకున్న టిఆర్ఎస్ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని ఏకంగా గ్రామాల్లో ఎమ్మెల్యేల మకాం వరకు వెళ్ళింది. ప్రధాన పోటీదారులు జనంలోకి వెళ్లడంతో గ్రాఫ్ పడిపోకుండా ఉంచేందుకు, 21న తనతోపాటు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలకు కౌంటర్ లు ఇస్తూ బ్రాండ్ కొనసాగిస్తున్నారు. సిపిఐ, సిపిఎం నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తుండగా.. బిఎస్ పి గోడ రాతలతో ప్రచారం ప్రారంభించింది.  దళిత శక్తి ప్రోగ్రాం బరిలో ఉంటుందని విశారధన్, ప్రజాశాంతి కెఏ పాల్ తన పార్టీ సైతం పోటీలో ఉంటుందని ప్రకటించారు. 

Munugode bypoll 2022 : టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటివద్ద అర్థరాత్రి హై డ్రామా..

ఇదిలా ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టిఆర్ఎస్ కు చెందిన ప్రముఖ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చౌటుప్పల్ టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్లో ఉన్నారు. త్వరలో బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీ లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. 

ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బీజేపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాదులోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి వుండే నివాసానికి ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు వచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.  భూ వివాదానికి సంబంధించిన  గతంలో నమోదైన కేసులను  మరోసారి తెరపైకి తెచ్చి  వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్టు చేసేందుకు వచ్చామని అక్కడికి వచ్చిన పోలీసులు తెలిపారు.

దీంతో అసలు ఎందుకు అరెస్టు చేసి విచారిస్తారు అని తాడూరి నిలదీశారు. అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎంపీపీ వెంకట్రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన విషయం తెలిసి… ఎంపీపీ ఇంటికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బిజెపి నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాడూరి అరెస్టును అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి చౌటుప్పల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

click me!