
జగిత్యాల : Property Tax చెల్లించడం లేదని Municipal Staff ఓ ఇంటిముందు చెత్త పోసిన ఘటన Jagtial జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం ఇంటి మీద రూ. 54వలే ఆస్తిపన్ను బకాయి ఉంది. అయిదు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.1.04 లక్షలు చెల్లించాల్సిందిగా పురపాలక అధికారులు పలుమార్లు కోరారు. వారింట్లో ఇటీవల ఇద్దరు మృతి చెందడం, స్థానికంగా వారు ఎక్కువగా ఉండకపోవడంతో చెల్లింపులో జాప్యం జరిగింది. గురువారం పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరగా అప్పటికప్పుడు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించలేమని, ప్రస్తుతానికి రూ.25 వేలు చెల్లిస్తామని హైమద్ బిన్ సాలెం చెప్పారు.
దీనికి వారు అంగీకరించకుండా బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు ట్రాక్టర్ లో చెత్త తెప్పించి ఇంటిముందు కుప్పగా పోశారు. దీంతో సిబ్బందితో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరికి అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో చెత్తను పురపాలక సిబ్బంది తొలగించారు. ఈ సంఘటన మీద పురపాలక కమిషనర్ జె.స్వరూపారాణి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేశారు.