బొడ్డుపల్లి శీను హత్య కేసులో కొత్త ట్విస్ట్

First Published Jan 31, 2018, 1:28 PM IST
Highlights
  • హైకోర్టు తలుపు తట్టిన బొడ్డుపల్లి లక్ష్మి
  • తన భర్త హత్య వెనుక రాజకీయ కుట్ర ఉంది

నల్లగొండ జిల్లాకేంద్రంలో సంచలనం సృష్టించిన పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు మరో ములుపు తిరిగే చాన్స్ ఉంది. ఈ హత్యపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం మిర్చి బండికాడి చిల్లర పంచాయితీ కారణమని కొట్టిపారేస్తున్నారు. ఒక మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్తను చిల్లర పంచాయితి కారణంగా చంపేశారని ప్రకటనలు చేసి పోలీసులు చేతులు దుపులుకోవడం వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో తన భర్త హత్యకేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని శ్రీనివాస్ సతీమణి ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి పదే పదే వాదిస్తున్నది. ఆమె మీడియా ముందు సైతం తన భర్తను కుట్ర చేసి రాజకీయ నేతలే పొట్టనపెట్టుకున్నారని నెత్తినోరు కొట్టుకుంటూ చెబుతున్నది. కానీ వినేవారే లేరు. పోలీసులు మెరుపు వేగంతో హత్యకు కారణాలివి.. చిల్లర పంచాయితి.. మిర్చి బండి కొట్లాట అంటూ చెప్పి చేతులు దులుపుకున్నారు.

దీంతో తన భర్త చావుకు కారణమైన రాజకీయ నేతల బండారం బయటపెట్టాలంటూ హైకోర్టు తలుపు తట్టింది చైర్ పర్సన్ లక్ష్మి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ చేత కానీ.. లేదా సిట్ విచారణ కానీ చేయించాలంటూ ఆమె హైకోర్టును కోరింది. బుధవారం ఆమె తరుపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం తర్వాత కేసుపై హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

ముందునుంచీ లక్ష్మి ఈ హత్య వెనుక కుట్రకోణం ఉందంటూ పదేపదే చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించకపోతే తాను ఆమరణ దీక్ష చేయడానికైనా వెనుకాడబోనంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే హత్య వెనుక అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని కాంగ్రెస్ బలంగా ఆరోపణలు గుప్పించింది. అంతే స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులే బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేశారంటూ టిఆర్ఎస్ ప్రతివిమర్శలు గుప్పించింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు బురద పోసుకుంటున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టుకు చేరింది ఈ కేసు. మరి కోర్టులో ఎలాంటి డైరెక్షన్ వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

click me!