ఎంపి కవిత సి బ్లాక్ ఎందుకొచ్చిరబ్బా ?

First Published Jan 30, 2018, 8:00 PM IST
Highlights
  • సచివాలయంలో హల్ చల్
  • సి బ్లాక్ లో మీడియాతో ముచ్చట్లు
  • కేసిఆర్ వారసత్వంపై కామెంట్స్

తెలంగాణ రాక ముందు సచివాలయం కళకళలాడింది. నిత్యం వందలు, వేల మంది ప్రజలు తమ పనుల కోసం సచివాలయం వచ్చేవారు. సామాన్యులు సైతం క్యూ కట్టి మరీ వచ్చి తమ బాధలు చెప్పుకుని తీర్చుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీన్ రివర్స్ అయింది. 

తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్ళ కాలంలో సచివాలయం బోసిపోయి కనబడుతున్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి బ్లాక్ పరిస్థితి మరీ దారుణం. సి బ్లాక్ ముందు పది మంది పోలీసులు.. పావురాలు తప్ప ఏమీ లేదు. ప్రగతిభవన్ నిర్మాణం పూర్తయిన నాటినుంచి సిఎం కేసిఆర్ సచివాలయానికి వచ్చింది లేదు. సి బ్లాక్ లో కాలు పెట్టింది లేదు.

కానీ అనూహ్యంగా కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత సచివాలయం సి బ్లాక్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఛాంబర్లో కూర్చున్నారు. ఇంత వరకు అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. పైగా మీడియాతో చిట్ చాట్ చేశారు. సకల రాజకీయ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రిపోర్టర్లు అడిగినదానికి, అడగని వాటికి కూడా సమాధానాలు చెప్పారు. బాగానే ఉంది. కానీ.. అసలు ముచ్చేట ఎవరికీ అంతుచిక్కడం లేదు. సి బ్లాక్ లోకి రావడానికి ముందు ఆమె డిబ్లాక్ లో ఆరోగ్య మంత్రి డా.లక్ష్మారెడ్డిని కలిశారు.

అదేమంటే అసలు ఎంపి కవిత సచివాలయానికి ఎందుకొచ్చారు? ఈ ప్రశ్నలకు జబాబులేవీ???

వచ్చారు సరే? వస్తే ముఖ్యమంత్రి ఆఫీసు ఉన్న సి బ్లాక్ కు ఎందుకు వెళ్లినట్లు ?

సి బ్లాక్ లో ఏదైనా పని ఉంటే వెళ్లొచ్చు కానీ.. అక్కడే మీడియాతో ఎందుకు చిట్ చాట్ ? 

ఆమె తలుచుకుంటే తన ఇంటికే మీడియా ప్రతినిధులను పిలిపించుకోవచ్చు కదా?

లేదంటే అసెంబ్లీలోని టిఆర్ఎస్ ఎల్పీ లో మీడియాతో మాట్లాడొచ్చు కదా?

అదీ కాదంటే.. పార్టీ ఆఫీసు అయిన తెలంగాణ భవన్ లో మాట్లాడే చాన్స్ లేదా?

పోనీ.. అదీ కాదనుకుంటే.. సచివాలయంలోని ఇంకేదైనా బ్లాక్ లో మీడియాతో మాట్లాడొచ్చు కదా?

సిఎం కేసిఆరే రాని సచివాలయం వచ్చి కవిత మీడియాతో ఎందుకు మాట్లాడినట్లు ?

ఇప్పుడు ఈ ప్రశ్నల్నీ ఇటు టిఆర్ఎస్ శ్రేణుల్లో.. మిగతా రాజకీయ పార్టీల్లో ఉత్పన్నమవుతున్నాయి.

ఇక సచివాలయంలో ఎంపి కవిత ఏం మాట్లాడారో కింద చదవండి

చాలామంది కాంగ్రెస్‌ నేతలు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కోదండరామ్‌ రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తాం. రాజకీయ వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో మాకెలాంటి ఇబ్బంది లేదు. బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేశాం. మరికొన్ని నూతన కార్యక్రమాలు తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేసీఆర్‌ రాజకీయ వారసులు ఎవరనేది భవిష్యత్‌ నిర్ణయిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుంది. తెరాస 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. మంత్రి వర్గ విస్తరణ జరిపితే మహిళకు అవకాశం ఇవ్వాలని కోరతాను. రాష్ట్రానికి చెందిన ఒక్కరికైనా పద్మ అవార్డులు రాకపోవడం బాధాకరం.

కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అడిగాం. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉంది. పార్లమెంటు వేదికగా తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తాం. పసుపు బోర్డు విషయమై కేంద్రంలో కదలిక తీసుకొచ్చాం. సింగరేణి వారసత్వ ఉద్యోగాల ముసాయిదాను ఏజీ కూడా ఆమోదించారు. విధాన రూపకల్పన తర్వాత సీఎం సింగరేణి యాత్ర ఉంటుంది. పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి పోటీ చేస్తానంటున్నారు, అది ఆయన హక్కు. మేం వెలకమ్ చెబుతున్నాం. జమిలి ఎన్నికల ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చిస్తాం. అన్ని చట్టాలను పటిష్టం చేస్తున్నాం. అందులో భాగంగానే పరుష పదజాలానికి సంబంధించి కూడా మార్పులు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అన్ని స్థానాలూ గెలుస్తాం. హైకోర్టు విభజనతోపాటు విభజన హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలి.

click me!