
హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే సీతక్క.. చిన్న జీయర్ స్వామిపై మండిపడ్డారు. సమ్మక్క, సారలమ్మలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, చిన్న జీయర్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించారు. మా తల్లులది వ్యాపారమా? లేక సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మీరు చేస్తున్నదని వ్యాపారమా? అంటూ నిలదీశారు. తమ దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని చెప్పారు. అదే.. 120 కిలోల బంగారంల గల సమతామూర్తి విగ్రహం చూడటానికే మీరు రూ. 150 టికెట్ పెట్టారని విమర్శించారు. ఈ రెండింటినీ పోలుస్తూ ఎవరిది వ్యాపారం? అంటూ అడిగారు. ‘మీది బిజెనెస్.. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’ అంటూ సీతక్క మండిపడ్డారు.
అదే విధంగా ఆమె చిన్న జీయర్ స్వామిని నేరుగా విమర్శించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వారికి ఇంటికి వెళ్లారా? అంటూ అడిగారు. చిన్న జీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ స్వామిగా చిన్న జీయర్‌ను పేర్కొన్నారు. ఈ చిన్న జీయర్ స్వామికి తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, చిన జీయర్ స్వామి మాటలు మధ్యయుగం నాటి కాలాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి జనవరి నెలలో విమర్శించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చినజీయర్ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని అన్నారు. ఇవి ప్రజను ఆందోళనలకు గురి చేస్తున్నాయని విమర్శించారు. కులాలను నిర్మూలించకూడదని, ఎవరి కుల వృత్తిని వారు కొనసాగించాలని, మాంసాహారం తినకూడదని ప్రవచనాల్లో భాగంగా చినజీయర్ పలికిన మాటలు మధ్య యుగం కాలంలో చెల్లుబాటు అయ్యాయని అన్నారు. సంకుచిత భావాలు కలిగిఉన్న వ్యక్తి.. ఎన్నో కోట్లు ఖర్చు చేసి కట్టిన విగ్రహాలకు సమానత్వ ప్రతిమ అని పేరు ఖరారు చేయడం విచిత్రంగా ఉందని తెలిపారు. చిన జీయర్ స్వామి మాటల వల్ల బహుజనలు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీఎం హాజరుకావడం సరికాదని తెలిపారు. ఇలా హాజరుకావడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని ఆయన తెలిపారు.
ముచ్చింతల్‌లో సమతా విగ్రహం ఏర్పాటు తర్వాత చిన్న జీయర్ స్వామి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు ఇలా వివాదాలకూ కేంద్రంగా మారుతున్నాయి. మాంసం తినడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమ్మక్క సారలమ్మలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సమ్మక్క సారలమ్మలపై ఆయన ఇప్పట్లో కాదు.. చాలా ఏళ్ల క్రితమే చేశాడని, ఇప్పుడు వాటిని తెర మీదకు తెచ్చి రాజకీయం చేయడమేంటనీ ఇంకొందరు వాదిస్తున్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఖండించడంలో తప్పు లేదనీ వారు వాదిస్తున్నారు.