నన్ను నానా రకాలుగా వేధించారు.. కేసీఆర్‌పై ఒక్క కేసుందా, బీజేపీకి బీఆర్ఎస్‌ బీ టీమ్ గనుకే : రాహుల్ గాంధీ

By Siva Kodati  |  First Published Oct 18, 2023, 7:44 PM IST

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ . కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు .  ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు.  


తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ . బుధవారం ములుగులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ తాను చూడలేదన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే చిరునామా కోల్పోయిందని .. ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని.. వాటితో ఎంఐఎం కూడా కలిసిందని రాహుల్ దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందన్నారు.  కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

కేసీఆర్‌పై సీబీఐ, ఐటీ, ఈడీ కేసులేం వుండవని.. ఇదే బీఆర్ఎస్-బీజేపీ మిలాఖత్‌కు సాక్ష్యమన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించిందని.. కానీ కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా వుండదని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని రాహుల్ గాంధీ అభివర్ణించారు. బీజేపీతో కాంగ్రెస్‌ది సైద్ధాంతిక పోరాటమని..  సిద్ధాంతాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పూర్తిగా మద్ధతు ఇవ్వాలని.. తాము బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కేవలం తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం మీద బీజేపీని ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి బీటీమ్ అయిన బీఆర్ఎస్‌ను ఓడించడం చాలా అవసరమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

Latest Videos

దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలను పార్టీలు తీసుకోవని .. కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు, ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు .. ఇచ్చారా అని నిలదీశారు. అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు.. అవినీతి చేశారా, లేదా అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

 కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే కేసీఆర్ లక్ష కోట్లు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.. ఎంతమందికి చేశారు అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేర్చామని రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామన్నామని.. అమలు చేసి చూపామని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నామని రాహుల్ వెల్లడించారు. 

ALso Read: బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో.. ల్యాండ్, శాండ్, వైన్ ‌మాఫియాలతో బీఆర్ఎస్ దోపిడీ : ప్రియాంకా గాంధీ

రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా వుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం రూ.2,500కు కొంటామన్నాం.. కొన్నామన్నారు. దేశంలోనే వరి ధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక వెళ్లి చూడండి.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రతి నెలా వారి ఖాతాల్లోకి ఉచితంగా డబ్బు పడుతోందని .. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతం నుంచి మాట ఇస్తున్నా.. మీ భూములపై మీకు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 

పోడు భూములపైనా .. అసైన్డ్ భూములపైనా, మీ భూమిపై మీకు హక్కు కల్పిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఆయన వెల్లడించారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. గృహ జ్యోతి కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వబోతన్నామన్నారు. అభయ హస్తం కింద పింఛను పెంచి రూ.4000 ఇవ్వబోతున్నామని రాహుల్ తెలిపారు. యువ వికాసం కింద యువతీ యువకులకు రూ.5 లక్షలు ఇస్తామని.. సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 
 

click me!