పవన్ కల్యాణ్ నీ ఇంటికి వచ్చాడా: బాబును ప్రశ్నించిన మోత్కుపల్లి

First Published May 29, 2018, 3:04 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వచ్చాడా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వచ్చాడా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఏమీ కోరకుండా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సాయం చేశాడని ఆయన అన్నారు.

మంగళవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నమ్మకద్రోహి అని ఎన్టీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్, జగన్, కేసిఆర్ సొంత జెండాలు పెట్టుకున్నారని, చంద్రబాబు తెలుగుదేశం పార్టీని దొంగిలించారని అన్నారు. 

తెలుగుదేశం పార్టీలోని ఎన్టీఆర్ అభిమానులంతా మరణించారని అన్నారు. తాను రాజకీయాల్లో ఉంటానో లేదో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. చంద్రబాబు నమ్మిన పాపానికి తనకు శిక్ష వేశాడని అన్నారు. డబ్బులు తీసుకుని టీజీ వెంకటేష్ కు చంద్రబాబు రాజ్యసభ టికెట్ ఇచ్చాడని ఆరోపించారు. 

హైకోర్టు న్యాయమూర్తులుగా ఎస్సీలు, ఎస్టీలు పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని, ఆ లేఖలను తాను సమయం వచ్చినప్పుడు బయటపెడుతానని అన్నారు.   సీనియారిటీకి విలువ లేదన్న బాధతోనే గాలి ముద్దుకృష్ణమ లాంటి 20 మందిదాకా మరణించారని అన్నారు. జెండాను నమ్ముకున్న మాలాంటి వాళ్లను కాదని, నీలాంటి దొంగలను పార్టీలో చేర్చుకున్నావని దుయ్యబట్టారు.

వంద సార్లు ఫోన్‌ చేసినా ఎత్తవెందుకు, మీటింగ్‌కి ఎందుకు పిలవలేదనేకదా నేను అడిగింది.. ఫలానా కారణంతో పిలవలేదని చెబితే సరిపోయేదికదా, పనికిరాని మనుషుల చేత నన్ను తిట్టించడందేనికి? ఏ కులపోడు మాట్లడితే ఆ కులపోడితో తిట్టించడమేనా రాజకీయమంటే అని ఆయన చంద్రబాబును అడిగారు. నేను గవర్నర్ పదవి అడిగానా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించలేదని అడిగారు. ఎన్టీఆర్ కు మంచి పేరు రావడం చంద్రబాబుకు ఇష్టంలేనది అన్నారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిస్తే మెట్లెక్కి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని అన్నారు.  చంద్రబాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆయన అన్నారు. 

click me!