చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు: మోత్కుపల్లిపై టీడీపి వేటు

First Published May 28, 2018, 6:33 PM IST
Highlights

 పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై వేటు పడింది. 

హైదరాబాద్: పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తెలుగుదేశం నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

మోత్కుపల్లి నర్సింహాలును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్రకటించారు.

చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు సోమవారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద బోరున విలపించిన నర్సింహులు చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. 

చంద్రబాబును దొరకని దొంగగా ఆయన అభివర్ణించారు. పార్టీని ఎన్టీఆర్ నుంచి దొంగిలించారని కూడా ఆరోపించారు. అదే సమయంలో జగన్, పవన్ కల్యాణ్ లను ప్రశంసించారు. కేసిఆర్ నూ పొగిడారు. కేసిఆర్ కు చంద్రబాబు లొంగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ఉహాగానాలు కొద్ది కాలంగా చెలరేగుతున్నాయి.

మోత్కుపల్లి విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని, గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవ ప్రారంభించారని ఎల్. రమణ అన్నారు. ఎన్టీఆర్ కు కేసిఆర్ ప్రతిరూపమని మోత్కుపల్లి ఎలా అంటారని అడిగారు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదని అన్నారు. తనను బహిష్కరించే  హక్కు వారికి ఎక్కడిదని మోత్కుపల్లి అడిగారు. 

click me!