మహానాడు డుమ్మాపై మోత్కుపల్లి ఏమన్నారంటే ?

First Published May 24, 2018, 2:56 PM IST
Highlights

అసలు ముచ్చట ఇదేనట..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపిన మహానాడుకు ఇద్దరు తెలంగాణ కీలక నేతలు డుమ్మా కొట్టారు. అందులో ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కాగా మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. వీరిద్దరూ మహానాడుకు డుమ్మా కొట్టడంతో రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మోత్కుపల్లి పార్టీ మారి టిఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన మహానాడుకు డుమ్మా కొట్టారు. ఇక మోత్కుపల్లి సొంత జిల్లా యాదాద్రిలో జరిగిన మహానాడుకు సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళన చేశారు. సభలో నిరసన తెలిపారు.

ఇక తెలంగాణ మహానాడుకు కూడా మోత్కుపల్లికి ఆహ్వానం రాలేదని చెబుతున్నారు. మహానాడుకు డుమ్మా కొట్టిన అంశంపై మోత్కుపల్లి ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు నాకు ఆహ్వానం రాలేదు. చంద్రబాబు నాయుడు నన్ను ఆహ్వానిస్తారని అనుకున్నాను. కానీ ఆయన  ఆ ప్రయత్నం చేయలేదు. అందుకే మహానాడుకు వెళ్లకుండా దూరంగా ఉన్నాను.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నా మాటలను టిడిపి నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీనిపై అధినేత చంద్రబాబుకే వివరణ ఇస్తానని అప్పట్లోనే చెప్పాను. కానీ ఆరోజునుంచి ఈరోజు వరకు చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు. ఎన్నిసార్లు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు.

మోత్కుపల్లి ఎందుకు వివాదంలో చిక్కారంటే ?

తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలేంట తక్షణమే పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి నరసింహులు కామెంట్ చేశారు. దీంతో పార్టీ మోత్కుపల్లిని దూరంగా పెట్టిందని చెబుతున్నారు. ఈమధ్య భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయనకు ఆహ్వానమే రాలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లిని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నారని సమాచారం.

మరో వైపు మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

click me!