మంచిర్యాల జిల్లాలో విషాదం... ఇద్దరు ఆడబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Sep 18, 2022, 9:13 AM IST
Highlights

ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తట్టుకోలేక ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ముక్కుపచ్చలారని ఇద్దరు ఆడబిడ్డలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

మంచిర్యాల : ఏం కష్టం వచ్చిందో తెలీదుకానీ ప్రాణాలు పోసిన తల్లే ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారుల ప్రాణాలుతీసింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా నవమాసాలు మోసిన తల్లే కన్నప్రేమను ఆరు నెలల పసిగుడ్డు, ఆరేళ్ల చిన్నారితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిధారక ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆదిలాబాద్ జిల్లా రుయాడికి చెందిన సాయికుమార్ - ధనలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సమన్విత(6ఏళ్లు), శంకరమ్మ(6నెలలు) సంతానం. స్వస్థలంలో సరయిన ఉపాధి లేక భార్యాబిడ్డల పోషణ కూడా భారంగా మారడంతో సాయికుమార్ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు వలసవెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ కూలీ డబ్బులు కుటుంబ పోషనకే ఖర్చవుతుండటంతో ఇతర అవసరాల కోసం తెలిసినవారి వద్ద అప్పులు తీసుకున్నాడు. ఇలా తీసుకున్న అప్పులు వడ్డీతో కలిసి పెనుభారంగా మారడంతో సాయికుమార్ వాటిని తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. 

read more  హైదరాబాద్‌లో దారుణం.. 40 ఏళ్ల మహిళ గొంతు కోసి హత్య...

డబ్బులిచ్చి చాలారోజులు కావడం, వడ్డీ కూడా సరిగ్గా చెల్లించకపోవడంతో అప్పులిచ్చిన వారు సాయికుమార్ ఇంటికొచ్చి గొడవచేయడం ప్రారంభించారు. సాయి కుమార్ తో పాటు ధనలక్ష్మిని కూడా దుర్భాషలాడుతూ అప్పు తీర్చాలని ఒత్తిడి చేయసాగారు. ఇలా ఇంటికొచ్చి గొడవచేయడం , అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు గురయిన ధనలక్ష్మి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు బిడ్డలతో కలిసి బలవన్మరణానికి సిద్దపడింది. 

 రోజూలాగే భర్త సాయికుమార్ కూలీ పనుల కోసం ఇంట్లోంచి బయటకు వెళ్లగానే ధనలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. మొదట ఇద్దరు బిడ్డలకు ఉరేసిన అనంతరం తానుకూడా ఆత్మహత్య చేసుకుంది. ఇలా తల్లీ, ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికివచ్చిన భర్త భార్యాబిడ్డలు ఉరేసుకుని వుండటం గమనించాడు. స్థానికుల సాయంతో వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే తల్లీబిడ్డలు మృతిచెంది వున్నారు. 

స్థానికులు ఈ ఆత్మహత్యలపై పోలీసులకు సమాచారమివ్వగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను కిందకు దించిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   
 

click me!