తెలంగాణాలో నేటి నుండి మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన కేసీఆర్

By Sree sFirst Published May 16, 2020, 6:26 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. 

‘‘తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయి. మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయి. 

కేంద్రం విధించిన తాజా లాక్ డౌన్ గడువు ఈ నెల 17 తో ముగుస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేసి, ప్రభుత్వం అమలు చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

 

మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. 

‘‘లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించిన నిధులను విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశాం. జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సిఎం అన్నారు.  ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

click me!