మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నందకుమార్ భార్య చిత్రలేఖను ఇవాళ కూడా సిట్ విచారించింది. సుమారు ఆరున్నర గంటలపాటు సిట్ బృందం చిత్రలేఖను పలు అంశాలపై ప్రశ్నించింది.
హైదరాబాద్:మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణ ముగిసింది. సోమవారంనాడు ఆరున్నర గంటలకు పైగా చిత్రలేఖను సిట్ బృందం విచారించింది. ఈ నెల 25న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ బృందం విచారించింది. ఇవాళ కూడా విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆమె విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో నందకుమార్ ఇప్పటికే అరెస్టయ్యారు.గత నెల 26న పోలీసులు నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రామచంద్రభారతి, సింహయాజీ,నందకుమార్ లపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను రెండు రోజుల పాటు సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మరో 10 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ గత వారం దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని తుషార్, బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఈ కేసులో జగ్గుస్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్. సిట్ నోటీసులపై బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. సిట్ నోటీసులపై హైకోర్టులో సంతోష్ కి ఊరట లభించింది.