మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో మరో ఇద్దరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. కేరళ రాష్ట్రంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. నాలుగు రాష్ట్రాల్లో సిట్ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్:మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సోదాల్లో సిట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుందని సమాచారం. ఏపీ, కర్ణాటక,హర్యానా,కేరళ రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేస్తుంది.కేరళ రాష్ట్రంలో రామచంద్రభారతితో సంబంధాలున్న డాక్టర్ కోసం సిట్ బృందం ఆరా తీసింది. అయితే సిట్ బృందం వస్తుందనే సమాచారం తెలుసుకున్న డాక్టర్ పారిపోయాడు.కేరళలో డాక్టర్ తో రామచంద్రభారతి సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది.తుషార్ కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా ఉన్నాడని ఆ కథనం తెలిపింది.రామచంద్రభారతితో ఆర్ధిక వ్యవహరాలు జరిపిన ఇద్దరిని సిట్ గుర్తించింది.ప్రశాంత్, శరత్ లు ఆర్ధిక సంబంధాలు జరిపినట్టుగా సిట్ గుర్తించిందని సమాచారం.వీరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుందని ప్రముఖ తెలుగు మీడియా ఎన్టీవీ కథనం ప్రసారంచేసింది.
గత నెల 26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభపెట్టారని ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది.ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ ముగ్గురికి తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది.
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు:నాలుగు రాష్ట్రాల్లో సిట్ సోదాలు
ఇదిలా ఉంటే ఈ కేసు విచారణపై హైకోర్టు స్టేను ఎత్తేసింది. మరోవైపు కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.విచారణతోపాటు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలను టీఆర్ఎస్ మీడియాకు విడుదల చేసింది.ఈ ఆధారాలను పోలీసులు కోర్టుకు కూడా అందించారు.నిందితుల వాయిస్ ను రికార్డు చేశారు పోలీసులు.ఆడియో, వీడియోలలోని ఆడియోను వాయిస్ రికార్డింగ్ తో పోల్చనున్నారు.గత వారంలో నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ లో నిందితుల వాయిస్ ను రికార్డు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు నలుగురు ఎమ్మెల్యేలు తమకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు పిర్యాదు చేశారు.గుజరాత్, యూపీకి చెందిన నెంబర్ల నుండి ఫోన్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.