
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజీలకు ఏసీబీ కోర్టు నవంబర్ 11 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితులు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే నిందితుల అనారోగ్యంపై ఏసీబీ కోర్టు నేడు విచారణ జరపనుంది. ఇక, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ముగ్గురు నిందితులు కూడా ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఆ తీర్పును సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసి నిందితులకి రిమాండ్ విధించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిందితుల రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు నిందితులను మళ్లీ అరెస్ట్ చేసి.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి నవంబర్ 11 వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. నిందితులుకు రిమాండ్ విధించవద్దని వారి తరపు లాయర్ న్యాయమూర్తిని కోరారు. అయితే లాయర్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఇదే కేసుకు సంబంధించి.. బీజేపీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మరో బెంచ్ నవంబర్ 4 వరకు దర్యాప్తుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.