
త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు మోడికి అగ్నిపరీక్షే. మామూలుగానే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడి పరిపాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనబడుతోంది. ఎందుకంటే, జరిగిన పనులు తక్కువ, చేసుకుంటున్న ప్రచారం ఎక్కువనే భావన ప్రజల్లో బాగా ప్రచారంలో ఉంది. దానికితోడు మోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఢిల్లీ, బీహార్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోర్లాపడింది. దాంతో భాజపాపై వ్యతిరేకత పెరుగుతోందన్నవిషయం స్సష్టమైంది.
ఇటువంటి నేపధ్యంలో వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తు మోడి చేసిన ప్రకటనతో యావత్ దేశం అతలాకుతలమైపోతోంది. పెద్ద నోట్లు రద్దై బుధవారానికి ఎనిమిది రోజులైనా సామాన్య ప్రజల కరెన్సీ సమస్యలు పెరుగుతున్నాయే గానీ ఏమాత్రం తగ్గటం లేదు. దానికితోడు కేంద్ర ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంకు తీసుకుంటున్నరోజుకో నిర్ణయంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
దేశంలోని ప్రజల మనోభావాలు బయటపడుతున్న ఈ నేపధ్యంలోనే త్వరలో జరుగనున్న యూపి, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలపై చర్చ మొదలైంది. ప్రస్తుత పరిస్ధితులను బట్టి రానున్న ఎన్నికల్లో భాజపా విజయావకాశాలు కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మామూలుగానే భాజపా మిత్రపక్షమైన అకాలీదళ్ పై పంజాబ్ లో ఏర్పడిన వ్యతిరేకత వల్ల తిరిగి గెలుపు కష్టమేనని అందరూ అనుకుంటున్నదే.
ఇక, యూపిలో అయితే ఎన్నికలు పూర్తిగా కలగూరగంపలాగ తయారైంది. అధికార సమాజ్వాది పార్టీ మళ్ళీ గెలిచేది అనుమానమే అని అనుకుంటున్నా భాజపాకు అధికారం దక్కే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్దితుల్లో మోడి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం రానున్న ఎన్నికల్లో భాజపాపై తీవ్ర ప్రభావం చూపక తప్పదని అనుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తట్టుకుని ఒక వేళ పై రెండు రాష్ట్రాల్లో గనుక భాజపా గెలిస్తే మోడికి 2019లో జరిగే ఎన్నికల్లో తిరుగుండదని అంచనా వేస్తున్నారు.