
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha ) కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలుపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఎఆర్‌ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్‌లోకి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేస్తున్నారని చెప్పారు.
రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా పార్లమెంట్ వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని అన్నారు. ఒక దేశం- ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి కవిత సూచించారు.
ఇక, తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని రైతుల తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తెలుగులో పోస్టు చేశారు.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో BJP,TRS ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతలు శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ప్రకటించారు.
రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా ట్వీట్ చేశారు.
ఇక, ధాన్యం కొనుగోళ్లపై ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది.