MLC elections: సమీపిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్న ఆ భయం..

By team teluguFirst Published Nov 13, 2021, 10:28 AM IST
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా స్థానిక సంస్థల ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్‌ కోసం ఆశిస్తున్న నేతలు.. ఈ ఎన్నికల్లో విజయం కోసం రూ. 10 కోట్ల వరకు ఖర్చుచేసేందుకు సిద్దంగా ఉన్నామని.. పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల  (MLC elections) నవంబర్ 16న నోటిఫికేషన్ వెలువడగా.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా స్థానిక సంస్థల ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారనున్నాయి. ఆయా సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ 12 స్థానాలు ప్రస్తుతం టీఆర్‌ఎస్ (TRS) చేతుల్లో ఉన్నవే. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. 

అయితే ఈసీ షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ప్రస్తుతం ఉన్నవారు కొందరు మరోసారి అవకాశం కూడా వారివంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు కేసీఆర్ కూడా.. పార్టీ అభ్యర్థుల విషయంలో అన్ని విషయాలను పరిగణలోని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, రాజకీయ నైపుణ్యం, పార్టీ పట్ల విధేయతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ 12 స్థానాలకు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌లతో పాటు దాదాపు 60 మంది సీనియర్లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది. గత రెండేళ్ల నుంచి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రనిధులలో 90 శాతం మంతి ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు.  

ఈ అంచనాల ప్రకారం.. TRS పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయం. అయితే కొన్నిచోట్ల మాత్రం తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు బుట్టలో వేసుకునే అవకాశం ఉందనే భయం కూడా వెంటాడుతోంది. దీంతో ఎన్నికల బరిలో నిలవాలని అనుకునే అభ్యర్థులు ఏ మాత్ర అజాగ్రత్తగా ఉండకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొస్తున్న అభ్యర్థులు కొందరు తాము విజయం కోసం రూ. 10 కోట్ల వరకు ఖర్చుచేసేందుకు సిద్దంగా ఉన్నామని.. పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

Also read: TRS Dharna: ఏదైనా కోపముంటే మాపై చూపించండి... మా రైతులపై కాదు.: బిజెపి సర్కార్ కు గంగుల హెచ్చరిక

తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను డిసెంబర్ 10 పోలింగ్ తేదీ వరకు ఇతర రాష్ట్రాల్లోని రిసార్ట్స్, హోటల్స్‌కు తరలించేందుకు కూడా సిద్దంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా ప్రజాప్రతినిధులకు రూ. 5 లక్షల వరకు నగదు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని కూడా సింకేతాలు పంపుతున్నారు. 

స్థానిక సంస్థల కోటా కింద ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నగదు, బహుమతుల కోసం.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉందని, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి కార్లను సర్పంచ్‌లకు పంపిణీ చేసిన సందర్భాలను కూడా అభ్యర్థులుగా బరిలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నవారు గుర్తుచేస్తున్నారు. 

తమకు పోటీగా సంపన్న అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి గానీ, ఇండిపెండెంట్‌గా గానీ బరిలో నిలిస్తే.. టీఆర్‌ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులను ఆకర్షించడానికి భారీగా ఖర్చు చేసే అవకాశం ఉందని వారి వాదన. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల తాము కూడా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని పార్టీ నాయకత్వానికి సమాచారం చెరవేస్తున్నారు. 

ఇక, ఈ MLC electionsకు.. ఎన్నికల సంఘం ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగుతుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 26న ఉపసంహరణకు అఖరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

click me!