
తన కొడుకు రాజకీయ భవిష్యతును ఆగం చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తాను 2 నెలలు అనారోగ్యంతో బాధపడ్డానని తెలిపారు. తాను లేని సమయంలో తన కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారని చెప్పుకొచ్చారు. తాను అనారోగ్యం బారిన పడకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారం బయటపెడతానని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. తన పార్టీ వాళ్లతో పాటు ఇతర పార్టీల వాళ్లు కుమ్మకైయ్యారని.. అంతా కలిసే కుట్రలు చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రలు చూసి రాఘవపై ప్రజల్లో సింపతి పెరిగిందని చెప్పుకొచ్చారు. రాఘవపై పెట్టిన కేసు నిలవదని అన్నారు.
వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ వేధింపుల కారణంగా ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడక ముందు రాఘవ వేధింపులకు సంబంధించి రామకృష్ణ రికార్డు చేసిన వీడియోలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. తమ కుటుంబం ఎంత మానసనిక వేదనకు గురైందో రామకృష్ణ వీడియోలలో చెప్పారు. దీంతో రాఘవను అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు రాఘవను అరెస్ట్ చేసింది.
తాజాగా ఈ కేసులో వనమా రాఘవకు ఇటీవల హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోకి ప్రవేశించరాదని.. ప్రతి శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని, సాక్ష్యులను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం వంటివి చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది.
అయితే వనమా రాఘవకు బెయిల్ మంజూరు అయిన రెండు రోజులకే వెంకటేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. గత రెండు నెలలుగా ఎలాంటి కుట్ర ఉందని చెప్పని.. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.