ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు. ఆయన హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే.. తాను మోడీ సభకు హాజరుకాలేకపోవడం బాధాకరంగా ఉన్నదని చెబుతూ రాజాసింగ్ ఓ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో నిర్వహించి బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. బీసీలకు భరోసా ఇచ్చే, బీసీల అభివృద్ధికి తోడ్పడే ఏకైక పార్టీ బీజేపీ అని ప్రధాని పదే పదే చెప్పారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు కూడా ప్రసంగించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అధికార బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. బీసీ సీఎంను ప్రకటించిన బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ పెట్టి వారిని తమకు పునాదిగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నది. ఈ సభ విజయవంతంగా సాగింది. అయితే.. ఈ సభకు రాజా సింగ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. రాజాసింగ్ పై దీర్ఘకాలం సస్పెన్షన్ కొనసాగించిన పార్టీ.. చివరి నిమిషంలో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసి గోషామహల్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ సభకు రాజాసింగ్ హాజరుకాకపోవడంపై చర్చ రేగింది. అయితే.. దీనిపై రాజా సింగ్ ఓ వివరణ ఇచ్చారు.
Also Read: చాయ్ లేట్‌గా ఇచ్చారని ఆపరేషన్ చేయకుండానే నలుగురు పేషెంట్లను వదిలి థియేటర్ నుంచి వెళ్లిపోయిన డాక్టర్
ప్రధాని మోడీ సభకు హాజరుకాలేకపోయినందుకు తాను బాధపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయితే.. ఈ సభల పాల్గొంటే సభకు వెచ్చించిన మొత్తంలో కొంత వాటా తన ఎన్నికల ఖర్చులో చూపించాల్సి వస్తుందని వివరించారు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు రూ. 40 లక్షలకు మించకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మోడీ సభకు తాను పాల్గొనలేదని రాజాసింగ్ తెలిపారు. అంతే తప్పా మరో కారణం లేదని, అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు ఓ ప్రకటనలో వివరించారు.