
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ నాయకత్వం.. ప్రజా గోస -బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా సిద్దిపేట, వేములవాడ, బోధన్, నర్సంపేట, జుక్కల్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. బోధన్ నియోజకవర్గ యాత్ర బాధ్యతలను బీజేఎల్పీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అప్పగించారు. ఈ నెల 21న ఆయన బోధన్ నియోజవర్గంలో యాత్రను ప్రారంభించారు. బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ బైక్ యాత్రను మొదలు పెట్టారు.
తన యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాజాసింగ్.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇసుక అక్రమ మాఫియాను నడిపిస్తూ సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే కనిపిస్తున్నాయని.. బురద రోడ్డుపై రాజాసింగ్ నాట్లు వేసి నిరసన తెలిపారు.
అయితే బోధన్‌లో ప్రజా గోస -బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తున్న రాజా సింగ్.. బుధవారం మధ్యలోనే వెనుదిరిగారు. జనం లేకపోవడంతో అసంతృప్తితో వెళ్లిపోయారు.
ఈ పరిణామంతో స్థానిక నేతలు అవాక్కయ్యారు.