
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరరేట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారునిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అలాగే ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. ఈడీ నోటీసులు, ప్రస్తుత పరిణామాలపై కూడా చర్చించారు. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్ రోహిత్ రెడ్డి.. తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారనేది అధికారులు స్పష్టం చేయలేదని చెప్పారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్నందుకే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
‘‘డిసెంబర్ 19న హాజరు కావాలని నాకు సమన్లు అందాయి. నా ఐడెండిటీ ప్రూఫ్స్, ఐటీ రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, కుటుంబ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. నేను నా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాను. నా కుటుంబ సభ్యులకు గానీ, నాకు గానీ గుట్కా వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులపై ఎటువంటి కేసు లేదు. కుటుంబ సభ్యులలో ఎవరికీ ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. 2015 నుంచి నా చర, స్థిరాస్తులు, బ్యాంకు రుణాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. బెంగళూరు డ్రగ్స్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కర్ణాటక పోలీసులు నన్ను ఎప్పుడూ పిలవలేదు. ఇది మొట్టమొదటి సమన్లు, వారు నన్ను ఏ కేసు కోసం పిలుస్తున్నారో వారు ప్రస్తావించలేదు’’ అని రోహిత్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
ఈడీ నోటీసుల నేపథ్యంలో.. బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై రోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శనివారం రోహిత్ రెడ్డి పూజలు చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని, తనపై చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రోహిత్ రెడ్డి సవాలు విసిరారు. 24 గంటల డెడ్‌లైన్ కూడా విధించారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి పైలెట్ రోహిత్ రెడ్డి.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు డ్రగ్స్ కేసులో తన ప్రమేయాన్ని బండి సంజయ్ సహా బీజేపీ నేతలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని తెలిపారు. బండి సంజయ్ తన సవాలును స్వీకరించడంలో విఫలమయ్యారని అన్నారు. తనకు డ్రగ్ కేసులో ప్రమేయం లేదని అన్నారు. తనపై పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు.
బీఆర్‌ఎస్‌కు బీజేపీ భయపడుతోందని.. అందుకే తమ పార్టీ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల చేత దాడులు చేయిస్తుందని ఆరోపించారు. బండి సంజయ్ మతం పేరుతో యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటామని, సమాధానం చెబుతామని తెలిపారు.