సత్తుపల్లిలో రేపు ఎంపీలకు సన్మానసభ టీఆర్ఎస్ లో చిచ్చు రేపింది. ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, మాజీ ఎంపీని ఆహ్వానించొద్దని ప్రత్యర్ధులు కోరుతున్నారు. అయితే వీరిద్దరికి కూడా ఆహ్వానం పంపారు పార్టీ నేతలు.
ఖమ్మం: రాజ్యసభ సభ్యుల సన్మాన కార్యక్రమం టీఆర్ఎస్ లో చిచ్చును రేపింది. ఈ సన్మాన సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ఆహ్వానించవద్దని ప్రత్యర్ధులు కోరుతున్నారు.అయినా కూడా వారిద్దరికి ఆహ్వానం పంపారు.తమ మధ్య విబేధాలను పక్కన పెట్టాలని పార్టీ నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. ఈ తరుణంలో రేపు సత్తుపల్లిలో నిర్వహించే టీఆర్ఎస్ ఎంపీల అభినందన సభపైనే అందరి చూపు పడింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి టీఆర్ఎస్ నుండి గాయత్రి రవికి, బండి పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ నాయకత్వం పదవులు కట్టబెట్టింది. రెండు మాసాల క్రితమే గాయత్రి రవికి సన్మానసభ నిర్వహించారు. ఈ ఇద్దరు ఎంపీలకు రేపు సత్తుపల్లిలో ఏర్పాటు చేశారు.ఈ సభ ఏర్పాట్ల విషయమై పార్టీ సమావేశంలో చర్చించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ సన్మానసభకు ఆహ్వానించవద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పట్టుబట్టారు. స్వంత ఎజెండాతో ముందుకు వెళ్తున్న తుమ్మల నాగేశ్వరరావును కార్యక్రమానికి ఆహ్వానించవద్దని ఆయన పట్టుబట్టారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించవద్దని మరికొందరు ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్టుగా సమాచారం. అయినా కూడా రేపటి సమావేశానికి వీరిద్దరికి ఆహ్వనాలు పంపారు.
also read:అందరి చూపు వాజేడుపైనే: నేడు అనుచరులతో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం
2018 ఎన్నికల్లో పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గాలకు మధ్య పొసగడం లేదు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొందరు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమనే ఆరోపణలు వచ్చాయి. పలు కారణాలలతో 2019 లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. తుమ్మలనాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు.ఇటీవల వాజేడులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తాను కేసీఆర్ వెంటే ఉంటానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.